ఆనంద్‌కు చుక్కెదురు
రెండో గేమ్‌లో కార్ల్సన్ గెలుపు
{పపంచ చెస్ చాంపియన్‌షిప్
సోచి (రష్యా): కీలకదశలో అనవసర తప్పిదం చేసిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో తొలి ఓటమిని చవిచూశాడు. ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ 35 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించాడు. ఆరంభంలో ఆనంద్ ఆటతీరును చూస్తే రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. కానీ కార్ల్సన్ సంయమనంతో ఆడి మిడిల్ గేమ్‌లో ఆనంద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు.
ఆ తర్వాత ఆనంద్ తడబడి 34వ ఎత్తులో బంటును హెచ్5 గడిలోకి పంపి కోలుకోలేని తప్పిదం చేశాడు. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న కార్ల్సన్ తర్వాతి ఎత్తులోనే ఆనంద్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో కార్ల్సన్ 1.5-0.5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం మూడో గేమ్ జరుగుతుంది.