grandmothers
-
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్‌లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్‌జర్నీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
వేకువ పువ్వు
అది డిసెంబర్లో ఒక సాయంత్రం. ఒక చెట్టు కింద చినిగిన దుస్తులు కట్టుకుని ఉన్న ఒక అవ్వ చేతిలో సత్తుగిన్నెతో నిలుచుని ఉంది. ఎన్ని అనుభవాలో.. ఆ అవ్వ ముఖం మీద ముడతలై పరుచుకుని ఉన్నాయి. చలికాలం కావటం వల్ల అందరూ ఒంటినిండా వెచ్చటి చలికోట్లు. చేతుల్లో పెద్ద పెద్ద సంచుల్లో ప్లాస్టిక్ నక్షత్రాలు, చెట్లు, అలంకరణ సామగ్రితో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నారు. తన ముందు నుంచి వెళ్తున్న అందరి వంక ఆ అవ్వ తన సత్తుగిన్నెను చాపి ఆశగా చూస్తోంది. కొందరు ఆ చెట్టు కిందే ఆగి తాము చేసిన క్రిస్మస్ షాపింగ్ గురించి, క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఆమె వంక కూడా చూడటం లేదు. అయితే అవ్వ మాత్రం వారి మాటలు ఆసక్తిగా వింటున్నట్టుగా చెవులు రిక్కిస్తోంది. ఇంతలో ఒక పెద్ద కారు అవ్వ ముందు ఆగింది. ఆమె కళ్ళలో ఆనందం! ఇక ఆ అవ్వ గిన్నెధనంతో నిండి పోతుంది అని.. చిన్న సంతోషం. కారు వెళ్లిపోయింది. ఆ అవ్వ గిన్నెలో ఒక్క పది రూపాయల నోటు కనిపించింది.. కారు పెద్దదే కానీ అందులో ఉన్నవారి హృదయాలు చిన్నవే అనుకుంటా! ఆ అవ్వ ఆ గిన్నెలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే అవ్వకి సాయం చేయాలని నేను అటువైపు కదిలాను. ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో నక్షత్రం తెగిపడినట్టు ఉన్నపాటుగా వేకువపువ్వు పరిమళించినట్టుగా ఒక చిన్న పాప ఆ అవ్వ సత్తు గిన్నెలో వందరూపాయల కాగితం వేసి తన వంటిమీద ఉన్న శాలువాను అవ్వ మీద కప్పి అవ్వని ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది. అదంతా చూస్తున్న నాకు క్రీస్తు పుట్టింది ఆ పాప హృదయంలోనేనేమో అనిపించింది. కాసేపయ్యాక ఆ అవ్వ తన సత్తుగిన్నెలో ఉన్న పైసలు లెక్కపెట్టుకొని ఎదురుగా అడుక్కుంటున్న ఒక అంధుడి గిన్నెలో కొంత వేసింది. మెల్లిగా వెళ్లి ఆ అవ్వని అడిగాను – అవ్వా! నీకు వచ్చిందే తక్కువ కదా, మళ్ళీ అందులోనే అతనికి దానం చేసావేంటి అని. అప్పుడు ఆ అవ్వ నావైపు చూసి – అయ్యా! నేను మొత్తం ఇవ్వలేదు. నాకు కలిగిన దానిలో కొంత ఇచ్చాను. ఇవ్వమని నా ప్రభువు చెప్పాడు! అని అంది. అప్పుడు అర్థమైంది నాకు ఆ అవ్వ ఎంత ధనవంతురాలో..! – బెల్లంకొండ రవికాంత్ -
నానమ్మల ఓనమాలు!
ఆ ఊరి పేరు ఫాంగనే. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుగ్రామం. ఆ విద్యార్థులు ప్రతి రోజూ మధ్యాహ్నం యూనిఫాం ధరిస్తారు. పలకా బలపం, అబాకస్‌ను స్కూల్ సంచిలో పెట్టుకుంటారు. అడుగులో అడుగుగా నడుస్తూ స్కూల్‌కు వెళతారు. అక్కడ అ ఆ దిద్దుతారు. గుణింతాలు వల్లెవేస్తారు. ఆ విద్యార్థుల్లో కొందరికి కళ్లు సరిగా కనపడవు. కొందరికి కాళ్లు సరిగా నిలబడవు. ఇంకొందరికి మాటలు సరిగా వినబడవు. మరికొందరికి గట్టిగా మాట్లాడితే ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ.. ప్రతి రోజూ వారు ఠంచనుగా బడికి వెళతారు. సహ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో చదువుకుంటుంటారు. స్కూలు ఆవరణలో వారే స్వయంగా నాటిన మొక్కలకు రోజూ నీళ్లు పోస్తారు. వారంతా కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనుమలు కూడా ఉన్న.. అమ్మమ్మలు. నానమ్మలు! వారి వయసు 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకూ ఉంటుంది. ఊర్లో మహిళలు చదువుకోలేకపోవడం పెద్ద లోటుగా గుర్తించిన యోగేంద్ర బంగర్ అనే 41 సంవత్సరాల ఆదర్శనీయుడు.. 2016 మహిళా దినోత్సవం రోజును ఈ పాఠశాలను ప్రారంభించారు. ఒక తరగతిని ఏర్పాటు చేసుకుని, విరాళాలు సేకరించి ఆ విద్యార్థుల కోసం గులాబీ రంగు చీరలు, పలకలు, పుస్తకాలు సమకూర్చారు. శీతల్ మోరె (30) అనే ఉపాధ్యాయురాలు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఆమె అత్తగారు కూడా ఆమె వద్ద చదువు నేర్చుకుంటున్నారు. ఏడాది కాలంలో ఈ విద్యార్థుల బృందంలో ఒకరు కన్నుమూశారు. ముగ్గురు కొత్త విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థినులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. ‘‘దేశంలో చదువుకోని వారందరూ చదువుకోవాలి. ప్రతి గ్రామంలో మహిళలందరి కోసం పాఠశాలలు ఉండాలి’’ అని ఆ ఉపాధ్యాయులు అభిలషిస్తున్నారు. విద్యాభ్యాసానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్న ఈ అమ్మమ్మలు, నానమ్మలు అక్షరమాల నేర్చుకున్నారు. 1 నుండి 21 వరకూ చదవడం రాయడం చేయగలుగుతున్నారు. అందరూ వేలిముద్రలకు బదులుగా సంతకం చేయగలుగుతున్నారు. అయితే.. తాము చదివింది, స్కూల్లో బోధించింది గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని కొందరు చెప్తున్నారు. ఫొటోగ్రాఫర్ సాత్యకి ఘోష్ ఈ మహిళల అక్షరాస్యతా ప్రయాణాన్ని అద్భుతమైన ఫొటో దృశ్యాలతో నమోదు చేస్తున్నారు. అనసూయ దేశ్‌ముఖ్ వయసు 90 సంవత్సరాలు. చిన్నప్పుడు చదువుకోవాలంటే పలక, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. పదేళ్ల వయసులోనే ఆమెకు పెళ్లిచేశారు. కానీ.. ఇప్పుడామె ఏడాది కాలంగా చదువుకుంటున్నారు. సంతకం పెట్టగలుగుతున్నారు. రాంభాయ్ గాన్పాత్ను ఆమె మనుమలు చేయిపట్టుకుని నడిపిస్తూ స్కూల్‌కు తీసుకెళతారు. ‘‘చాలా ఆనందంగా ఉంది. ఈ బడంటే మాకు చాలా ఇష్టం. అమ్మమ్మలమంతా కలిసి స్కూలుకు వెళతాం. మేం బాగా చదువు నేర్చుకోగలుగుతున్నాం. అది గర్వంగా కూడా ఉంది’’ అని ఆమె చెప్తున్నారు. ‘‘కానీ.. మా కళ్లు సరిగా కనపడవు. కాబట్టి ఎక్కువగా బాగా చదవలేకపోతున్నాం’’ అంటూ నవ్వేస్తున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్