‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు.
‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది...
చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు.
ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక.
నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు.
కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది.
ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం!
బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు.
‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు.
‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి.
‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా.
ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది.
ఏ బామ్మను కదిలించినా....
వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం!
వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం!
కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను.
– మౌనిక (88)
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
Published Sun, Jul 31 2022 12:33 AM | Last Updated on Sun, Jul 31 2022 5:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment