నానమ్మల ఓనమాలు!
ఆ ఊరి పేరు ఫాంగనే. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుగ్రామం. ఆ విద్యార్థులు ప్రతి రోజూ మధ్యాహ్నం యూనిఫాం ధరిస్తారు. పలకా బలపం, అబాకస్ను స్కూల్ సంచిలో పెట్టుకుంటారు. అడుగులో అడుగుగా నడుస్తూ స్కూల్కు వెళతారు. అక్కడ అ ఆ దిద్దుతారు. గుణింతాలు వల్లెవేస్తారు. ఆ విద్యార్థుల్లో కొందరికి కళ్లు సరిగా కనపడవు. కొందరికి కాళ్లు సరిగా నిలబడవు. ఇంకొందరికి మాటలు సరిగా వినబడవు. మరికొందరికి గట్టిగా మాట్లాడితే ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ.. ప్రతి రోజూ వారు ఠంచనుగా బడికి వెళతారు. సహ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో చదువుకుంటుంటారు. స్కూలు ఆవరణలో వారే స్వయంగా నాటిన మొక్కలకు రోజూ నీళ్లు పోస్తారు. వారంతా కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనుమలు కూడా ఉన్న.. అమ్మమ్మలు. నానమ్మలు! వారి వయసు 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకూ ఉంటుంది.
ఊర్లో మహిళలు చదువుకోలేకపోవడం పెద్ద లోటుగా గుర్తించిన యోగేంద్ర బంగర్ అనే 41 సంవత్సరాల ఆదర్శనీయుడు.. 2016 మహిళా దినోత్సవం రోజును ఈ పాఠశాలను ప్రారంభించారు. ఒక తరగతిని ఏర్పాటు చేసుకుని, విరాళాలు సేకరించి ఆ విద్యార్థుల కోసం గులాబీ రంగు చీరలు, పలకలు, పుస్తకాలు సమకూర్చారు. శీతల్ మోరె (30) అనే ఉపాధ్యాయురాలు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఆమె అత్తగారు కూడా ఆమె వద్ద చదువు నేర్చుకుంటున్నారు. ఏడాది కాలంలో ఈ విద్యార్థుల బృందంలో ఒకరు కన్నుమూశారు. ముగ్గురు కొత్త విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థినులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. ‘‘దేశంలో చదువుకోని వారందరూ చదువుకోవాలి. ప్రతి గ్రామంలో మహిళలందరి కోసం పాఠశాలలు ఉండాలి’’ అని ఆ ఉపాధ్యాయులు అభిలషిస్తున్నారు.
విద్యాభ్యాసానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్న ఈ అమ్మమ్మలు, నానమ్మలు అక్షరమాల నేర్చుకున్నారు. 1 నుండి 21 వరకూ చదవడం రాయడం చేయగలుగుతున్నారు. అందరూ వేలిముద్రలకు బదులుగా సంతకం చేయగలుగుతున్నారు. అయితే.. తాము చదివింది, స్కూల్లో బోధించింది గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని కొందరు చెప్తున్నారు. ఫొటోగ్రాఫర్ సాత్యకి ఘోష్ ఈ మహిళల అక్షరాస్యతా ప్రయాణాన్ని అద్భుతమైన ఫొటో దృశ్యాలతో నమోదు చేస్తున్నారు.
అనసూయ దేశ్ముఖ్ వయసు 90 సంవత్సరాలు. చిన్నప్పుడు చదువుకోవాలంటే పలక, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. పదేళ్ల వయసులోనే ఆమెకు పెళ్లిచేశారు. కానీ.. ఇప్పుడామె ఏడాది కాలంగా చదువుకుంటున్నారు. సంతకం పెట్టగలుగుతున్నారు. రాంభాయ్ గాన్పాత్ను ఆమె మనుమలు చేయిపట్టుకుని నడిపిస్తూ స్కూల్కు తీసుకెళతారు. ‘‘చాలా ఆనందంగా ఉంది. ఈ బడంటే మాకు చాలా ఇష్టం. అమ్మమ్మలమంతా కలిసి స్కూలుకు వెళతాం. మేం బాగా చదువు నేర్చుకోగలుగుతున్నాం. అది గర్వంగా కూడా ఉంది’’ అని ఆమె చెప్తున్నారు. ‘‘కానీ.. మా కళ్లు సరిగా కనపడవు. కాబట్టి ఎక్కువగా బాగా చదవలేకపోతున్నాం’’ అంటూ నవ్వేస్తున్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్