72 నెలలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :1981-82 విద్యా సంవత్సరంలో అన్ని రాజకీయపార్టీల సహకారంతో ‘మిర్యాలగూడ ఎడ్యుకేషనల్ సొసైటీ’ పేరిట సేవాదృక్పథంతో ఓ డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. ఈ కళాశాల నిర్మాణానికి అప్పట్లోనే రూ.లక్ష విరాళమిచ్చిన కొండూరు వీరయ్య అనే దాత తండ్రి పేరిట కొండూరు నర్సయ్య మెమోరియల్ (కేఎన్ఎం) డిగ్రీ కళాశాల ఏర్పాటయింది. ఆ తర్వాత ఈ కళాశాలకు 1989-90 విద్యాసంవత్సరంలో పాక్షికంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేశారు. ఈ కళాశాలలో మొదట్లో ఆర్ట్స్, ఆ తర్వాత సైన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి మిర్యాలగూడ డివిజన్లో ఉన్నది కేఎన్ఎం డిగ్రీ కళాశాల ఒక్కటే. మిర్యాలగూడ చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఉన్న గిరిజన తండాలకు చెందిన విద్యార్థులకు, మిర్యాలగూడ,
నాగార్జునసాగర్, హుజూర్నగర్ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు ఇదొక్కటే ఆధారం. అనుభవజ్ఞులైన అధ్యాపకులుండడం, కళాశాలకున్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి సౌకర్యాల కారణంగా వివిధ కోర్సుల్లో 600కిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలను ఎయిడెడ్ కళాశాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చాలని 20 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థిసంఘాలు జేఏసీగా ఏర్పాటయి నిరాహార దీక్షలు చేశాయి. అప్పటి ప్రభుత్వాలు కూడా దీనిని ప్రభుత్వపరం చేసుకునేందుకు హామీ ఇచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఈ కళాశాలను ప్రభుత్వపరం చేయడం కోసం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్ అధికారంలోనికి వచ్చిన తర్వాత నల్లగొండ ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈ కళాశాలను ప్రభుత్వంపరం చేస్తూ 2008, డిసెంబర్ 12న జీఓనెం.290 విడుదలైంది.
వారంలో ప్రత్యేక జీఓ
ఈ కళాశాలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు చాలా కాలంగా కృషి జరుగుతూనే ఉంది. జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కళాశాల ప్రభుత్వపరం కావడం, భౌతికంగా స్వాధీనం చేసుకోవడం, పోస్టులు మంజూరు చేయడం జరిగిపోయాయి. కానీ, సిబ్బంది వేతనాలు, రెగ్యులరైజేషన్ గురించి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇక, గత సార్వత్రిక ఎన్నికల ముందు ఈ కళాశాల గురించి హామీ ఇవ్వని పార్టీనే లేదు. మిగిలిన పార్టీల మాట ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే వారం రోజుల్లో కేఎన్ఎం సమస్యను ప్రత్యేక జీఓ ద్వారా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అయితే అధికారంలోనికి వచ్చింది కానీ సమస్య మాత్రం పరిష్కారం కాకపోవడం గమనార్హం.
జిల్లాకే చెందిన విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం పెట్టి సీఎంకు పంపారని, ఈ ఫైలు మూడు నెలలుగా సీఎంఓలో పెండింగ్‌లో ఉందని సమాచారం. త్వరలోనే సమస్యను పరిష్కారిస్తామని మంత్రి అనధికారికంగా ఇస్తున్న హామీ మాత్రం ఆకలితో అలమటిస్తున్న ఆ సిబ్బందికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోనికి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆరేళ్లుగా రాని వేతనాలు వస్తాయని, కొలువులు రెగ్యులరైజ్ అవుతాయని, కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తమ బతుకుల్లో కచ్చితంగా వెలుగులు నింపుతుందని ఆశించారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తమ సమస్య పరిష్కారం కాకపోవడం శోచనీయమని వారంటున్నారు.
ఇక కష్టాలు మొదలు
వైఎస్ హయాంలో కళాశాలను ప్రభుత్వపరం చేసుకుంటున్నట్టు జీఓ రావడంతో అప్పటి వరకు ఉన్న కళాశాల యాజమాన్య కమిటీ రద్దయింది. ప్రభుత్వపరం కాకముందు నుంచే ఎయిడెడ్ సిబ్బందికి వేతనాలను ప్రభుత్వమే ఇస్తుండగా, అన్ ఎయిడెడ్ సిబ్బందికి మాత్రం కమిటీ ఇచ్చేది. కానీ ప్రభుత్వపరం అయిన తర్వాత ఈ ప్రభుత్వేతర సిబ్బందికి వేతనాలు నిలిచిపోయాయి. ఇక, ఆ తర్వాత మే, 4, 2011న జీఓ నెం 37 ద్వారా భౌతికంగా కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ 2012లో ఇంకో జీఓ వచ్చింది. జీఓ నెం. 64 పేరిట 2012, మార్చి 16న ఆర్థికశాఖ బోధన (40), బోధనేతర (25), ఔట్సోర్సింగ్ (11) పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇలా... ఉత్తర్వులు అయితే వస్తున్నాయి కానీ ప్రభుత్వేతర సిబ్బందికి వేతనాలు మాత్రం రావడం లేదు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బందిని ఈ మంజూరు పోస్టుల్లో చూపించినా జీతాలు మాత్రం రావడం లేదు. దీంతో 2008, డిసెంబర్ నుంచి ఇప్పటివరకు.. అంటే 72 నెలలుగా జీతాలు లేక బోధన, బోధనేతర సిబ్బంది అర్ధాకలితో అలమటిస్తూ పనిచేయాల్సి వస్తోంది.