పెన్షన్ టెన్షన్
- రోజుకో విధానంతో తలనొప్పులు
- 3 నెలలుగా లబ్ధిదారులకు అందని పెన్షన్లు
- 2 నెలలుగా రాని రూ.2.84 కోట్లు
- పెండింగ్‌లో రూ.6 కోట్ల చెల్లింపులు
విశాఖ రూరల్ : పెన్షన్ మంజూరు విధానాలు లబ్ధిదారులకు తలనొప్పిగా మారాయి. వికలాంగులు, వృద్ధులు, వితంతువులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పెన్షన్ల చెల్లింపులు చేస్తున్న సంస్థలు మారిన ప్రతీసారి లబ్ధిదారుల వివరాలను మళ్లీ మళ్లీ సేకరిస్తుండడం అటు అధికారులకు కూడా భారంగా పరిణమిస్తోంది. తాజాగా చెల్లింపుల్లో విధానంలో మార్పులతో మరోసారి లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ వివరాల సేకరణలో జాప్యంతో మూడు నెలలుగా జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు దాదాపుగా రూ.6 కోట్లు చెల్లింపులు నిలిచిపోయాయి.
బయోమెట్రిక్ చేయించుకున్నవారికి మాత్రమే జిల్లాలో రెండు నెలలుగా పెన్షన్లు ఇస్తున్నారు. దీనికి దూరంగా ఉన్న సుమారుగా 60 వేల మందికి పెన్షన్ అందడం లేదు. అలాగే నిధుల కేటాయింపుల్లోనూ కోత పడుతోంది. జిల్లాలో మొత్తం 3,19,124 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరికీ చెల్లింపులకు నెలకు రూ.7.93 కోట్లు అవసరముండగా కేవలం రూ.4.66 కోట్లు మాత్రమే విడుదలైంది. వృద్ధాప్య పెన్షన్ కింద 1,46,224 మందికి రూ.2.92 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, కేవలం 73,794 మందికి రూ.1.47 కోట్లు మాత్రమే మంజూరైంది.
అభయహస్తం కింద 18,957 మందికి రూ.95 లక్షల అవసరం కాగా, 10,960 మందికి రూ.54 లక్షలు జిల్లాకు విడుదలైంది. వికలాంగ పెన్షన్ కింద 37,990 లబ్ధిదారులకు రూ.1.9 కోట్లు అవసరముండగా, ప్రభుత్వం 22,343 మందికి రూ.1.1 కోట్లు ఇచ్చింది. కల్లుగీత కార్మికులు 926 మందికి రూ.1.85 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, 546 మందికి రూ.లక్ష మాత్రమే మంజూరు చేసింది. అదే విధంగా వితంతు పెన్షన్లు కింద 1,15,027 మంది లబ్ధిదారులకు రూ.2.3 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, కేవలం 61,750 మందికి రూ.1.23 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది.
విధానాలతో తలనొప్పులు : నిన్నమొన్నటి వరకు ఫినో సంస్థ ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. లబ్ధిదారులకు పూర్తి వివరాలతో పాటు వేలిముద్రలను కూడా సేకరించి ప్రతీ నెలా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. తాజాగా ఆ సంస్థతో ఒప్పందం రద్దయింది. దీంతో విశాఖ నగర పరిధిలో లబ్ధిదారులకు ఐసీఐసీఐ బ్యాంకులోను, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లింపులకు నిర్ణయించారు. దీంతో మరోసారి వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధిం చింది. విశాఖనగర పరిధిలో ఇంకా 6 వేల మంది, గ్రామీణ ప్రాంతాలు 28 మండలాల్లో 53 వేల మంది, ఏజెన్సీ 11 మండలాల్లో 49 వేల మంది లబ్ధిదారులను తమ వివరాలను నమోదు చేసుకోలేదు. ఫలితంగా వీరందరికీ మూడు నెలలుగా పెన్షన్లు అందడం లేదు.