కొత్త ఆలోచనలతో రండి..
గమ్యాన్ని చేరుకోండి
దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించండి
కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ కృష్ణప్రసాద్ పిలుపు
బీవీఆర్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్‌పై జాతీయ సదస్సు
12 అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్ల ప్రజంటేషన్
దేశ నలుమూలల నుంచి హాజరైన విద్యార్థులు, ప్రొఫెసర్లు
నర్సాపూర్ రూరల్: విద్యార్థులు కొత్త ఆలోచనలతో గమ్యాన్ని చేరి దేశాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ ప్రసాద్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ విష్ణురాజు అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బీవీఆర్ఐటీలో కెమ్‌కాన్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్‌గా ఆలోచించాలన్నారు.
ఆయా రకాల పరిశోధనలు చేపట్టి గమ్యాన్ని చేరుకోవాలన్నారు. అదే సమయంలో దేశాన్ని ప్రగతి గమ్యం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. పెట్రోలియం, పెట్రో కెమికల్, ఇంజినీరింగ్‌లో వస్తున్న మార్పులు, అవకాశాల గురించి ఆయన వివరించారు. బీవీఆర్ఐటీ యాజమాన్యం జాతీయ స్థాయిలో కెమికల్ సదస్సును నిర్వహించడాన్ని అభినందించారు. కార్యక్రమానికి తరలివచ్చిన ఆయా రాష్ట్రాల ప్రొఫెసర్లు, వెయ్యిమంది విద్యార్థులను ఆయన ఈ సందర్భంగా ఉద్దేశించి అనేక విషయాలను వివరించారు.
కెమికల్ ఇంజినీరింగ్‌తో మంచి భవిష్యత్తు
కెమికల్ ఇంజనీర్ వ్యవస్థ ఎప్పుడు పడిపోదని మళ్లీ మళ్లీ అది తిరిగి పైకి లేస్తుందని బీవీఆర్ఐటీ చైర్మన్ విష్ణురాజు అన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తేజాన్ని నింపుకుని నిత్యం పరిశోధనలు చేయాలన్నారు. ప్రస్తుతం కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బీవీఆర్ఐటీ కళాశాల ప్లేస్‌మెంట్లతోపాటు విద్యార్థుల పరిశోధనలు, వారు చేసిన ఆయా రకాల పరికరాలు, కెమికల్లో సాధించిన ఘనతను వివరించారు. అనంతరం ఆయా రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ ఈవెంట్స్ తదితర వాటిని డెలిగేట్స్ వీక్షించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సైతం టెక్నికల్ ఈవెంట్స్‌తోపాటు 12రకాల అంశాలపై చర్చ కొనసాగించారు. నర్సాపూర్‌లో ఇలాంటి జాతీయ సదస్సు జరగడం పట్ల విద్యార్థులు, స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
నేడు కూడా సదస్సు
ఈ సదస్సు ఆదివారం సైతం కొనసాగనుంది. ప్రాక్టికల్‌గా ఆయా రకాల ప్రదర్శన, పేపర్ ప్రజంటేషన్తోపాటు ముగింపు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో డాక్టర్ కిషన్‌కుమార్, జీబీ రాధిక, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.