గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం రాంరాం!?
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారుచేస్తూ హైకమాండ్ బుధవారం సాయంత్రం నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఇదే టికెట్ ఆశించి భంగపడ్డ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయినట్లు తెలిసింది.
తనకు టికెట్ ఇవ్వకపోయినాసరే, సీనియర్ నాయకులు డీ శ్రీనివాస్ లేదా సబితా ఇంద్రారెడ్డివంటి వారికో కాకుండా అంతగా ప్రజాదరణలేని ఆకుల లలితకు అవకాశం ఇవ్వడంపై దానం మండిపడుతున్నారని, ఈ విషయంలో అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని ఆయన అనుచరులు చెప్పారు. సంబంధిత విషయాలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానం ఓ లేఖ రాయనున్నట్లు తెలియవచ్చింది. అయితే దానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.