గతుకులకూ.. అతుకుల్లేవ్!
అటకెక్కిన కొత్తరోడ్ల ప్రతిపాదనలు
చిన్నచిన్న రిపేర్లూ చేయని పరిస్థితి
జిల్లాలో రహదారి ప్రయాణం నరకయాతనే
లోలెవల్ కాజ్వేలనూ పట్టించుకోని ప్రభుత్వం
ఆర్అండ్బీ పరిధిలో 134 కిలోమీటర్ల మేరకు మట్టి, గ్రావెల్ రోడ్లు
కంకర తేలిన రోడ్లు, మోకాలులోతు గుంతలు.. రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల మట్టిరోడ్ల దుస్థితి ఇది. ఈ రోడ్లలో ప్రయాణం నరకమే. ప్రభుత్వం వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. వర్షాలొస్తే తిప్పలు తప్పవు. నిధుల లేమితో జిల్లాలో కొత్త రోడ్ల ప్రతిపాదనలు అటకెక్కాయి. గతుకులకు అతుకులు పడే పరిస్థితీ లేకుండా పోయింది.
తిరుపతి: జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మారుమూల గ్రామాల రోడ్లు రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులు, వాహనదారులకు శాపంగా మారుతోంది. గతుకుల రోడ్లకు అతకులూ లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయమవుతోంది. జిల్లాలోని కొన్ని గ్రామాలకు కాలిబాట కూడా లేదు. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలోని ఆవులనత్తంగేట్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు నెలల తరబడి సా..గుతూనే ఉన్నాయి. ఇక గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో పది గ్రామాలకు చెరువుకట్టలే రహదారులు. సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణం లో భాగంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో పలుచోట్ల కల్వర్టుల కోసం రోడ్డు తవ్వకాలు చేపట్టారు. ఆ రోడ్డుపనులు పూర్తి చేయలేదు. పలమనేరులో ఆర్అండ్బీకి సంబంధించి మొత్తం 550 కి.మీ మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో పనులు 10 కి.మీ మేర ప్రారంభమై పెండింగ్లో ఉన్నాయి. 13.8 కి.మీ ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలే దు. నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం పిళాసపాళెం రోడ్డు తవ్వేసి సుమారు ఐదేళ్లవుతున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో సిబ్బందికి, నిధులకు కొదవలేకపోయినా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయలేని వింత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో అధికంగా అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. అటవీశాఖ అనుమతిలో జాప్యం వల్ల రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదు. పూతలపట్టు, జీడీ నెల్లూరు, సత్యవేడు, పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నిధుల లేమితో రోడ్ల మరమ్మతులు అటకెక్కాయి. ఆయా నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
వర్షమొస్తే ‘మునకే’
జిల్లాలో వర్షాలొస్తే మునిగిపోయి, రాకపోకలు నిలిచిపోయే ప్రమాదమున్న లోలెవల్ కాజ్వేలు 32 ఉన్నాయి. వీటి స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుతం స్వర్ణము ఖి నదిపై తొట్టంబేడు మండలం కనపర్తి వద్ద వంతెన నిర్మా ణం పనులు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం వద్ద, వరదయ్యపాళెం మండలం సంతవేలూరు, చంద్రగిరి మండలం రంగంపేట-పుదిపట్ల మధ్య రోడ్ల నిర్మా ణ పనులు సాగుతున్నాయి. మిగిలిన చోట్ల లోలెవల్ కాజ్వేల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణాలకు అధికారులు ప్రతినెలా ప్రతి పాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదు. నిధుల లేమిని సాకుగా చెపుతూ కొత్త రోడ్ల నిర్మాణాలకు మొండిచెయ్యి చూపుతోంది. నిధుల లేమితో రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.
కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపాం..
జిల్లాలో గ్రావెల్, మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాం. లోలెవల్ కాజ్వేల స్థానంలో బ్రిడ్జి నిర్మాణా ల కోసం ప్రభుత్వానికి నివేదిం చాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మరమ్మతులు చేపడుతున్నాం.
- శివకుమార్, ఎస్ఈ, ఆర్అండ్బీ, చిత్తూరు