గ్రేడ్-4 కొలువుల కోసం పోటాపోటీ
సాక్షి, సంగారెడ్డి: ‘‘అన్నా ! పాజిటివ్‌గా రాయ్.. జాబ్ రాలేదని రాస్తే నా పరువు పోతుంది (నవ్వుతూ). యాక్చువల్లి నాకు జాబ్ వచ్చింది. నేనే జాయిన్ కాలేదు’’ కంప్యూటర్ సైన్స్‌లో మూడేళ్ల కింద బీటెక్ పూర్తి చేసి, బుధవారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 పోస్టుకు దర ఖాస్తు చేసుకోడానికి వచ్చిన ఓ నిరుద్యోగిని చెప్పిన మొహ‘మాట’లు ఇవి.
బీటెక్ పూర్తిచేసిన విద్యార్థి పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నాడా...అని ఆలోచిస్తున్నారా..పైన పేర్కొన్న యువకుడే కాదు...ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, ఎంఎస్సీ లాంటి ఉన్నత అర్హతలు కలిగిన అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట క్యూ కడుతున్నారు. దీంతో గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తు నిరుద్యోగులతో కిటకిటలాడుతోంది. ఇప్పుడే డిగ్రీ పూర్తిచేసిన తాజా ముఖాల నుంచి వయస్సు మళ్లిన ముదురు ఫేసుల వరకు ఆడా మగా నిరుద్యోగులంతా వేల సంఖ్యలో కదిలి వచ్చి దరఖాస్తు వేస్తున్నారు. ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ వయస్సు మీరిపోతుండడంతో చివరి ప్రయత్నం చేస్తున్న వాళ్లు గణనీయంగా ఉన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గత నెల 30న ప్రకటన విడుదలైంది. ఏదైన డిగ్రీతో పాటు 18-36 ఏళ్ల వయో పరిమితిని అర్హతగా నిర్ణయించారు. ఈ నెల నుంచి 1న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 10వ తేదీతో ముగియనుంది. గడువుకు మరో నాలుగు రోజుల సమయం మిగిలి ఉన్నా ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 7,500 దరఖాస్తులు అమ్ముడుపోగా.. ఇప్పటి వరకు 5 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి.
కాంట్రాక్టు ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగులు
ఈ పోస్టులను దక్కించుకునేందుకు నిరుద్యోగులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పోటాపోటీగా తలపడుతున్నారు. రాతపరీక్ష ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డిగ్రీలో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు. డిగ్రీ పూర్తయి ఏడాది నుంచి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అదనంగా కేటాయిస్తారు. ఇది దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుందని తొలుత నోటిఫికేషన్లో ప్రకటించారు. అయితే, డిగ్రీ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను కేవలం పనిచేస్తున్న కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకే వెయిటేజీగా కేటాయిస్తామని పంచాయతీరాజ్ శాఖ స్పష్టత ఇచ్చింది. దీంతో పాటు కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల ఒక్కో ఏడాది సర్వీసుకు మూడు మార్కులు చొప్పున గరిష్టంగా 15 మార్కులను అదనపు వెయిటేజీగా ఇస్తారు. దీంతో వీరికి 25 మార్కులు అదనంగా రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా దాదాపు 200 మంది డిగ్రీ అర్హత కలిగి ఉండడంతో పోటీ పడుతున్నారు. అదనపు వెయిటేజీ నిబంధనల వల్ల ఎక్కువ ఉద్యోగాలు వీరికే దక్కే అవకాశాలున్నాయి. డిగ్రీలో 90 శాతం మార్కులు సాధించినా నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోయింది.
ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాలేదు
ఇదే ఏడాది 62 శాతం మార్కులతో ఎంబీఏ పూర్తి చేశా. ఇప్పటి వరకు 10 ఇంటర్వ్యూలకు వెళ్లా. స్కిల్స్ మెరుగు పరుచుకోవాలని తిప్పి పంపించారు. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం కోసం సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను. ఎంబీఏకు టెన్త్ క్లాస్‌కు ఈ రోజుల్లో ఒకే వ్యాలు అయిపోయింది. ఎంబీఏ ద్వారా ఉద్యోగం వస్తదని ఆశలు లేవు.
-జి. శ్రీకాంత్, రాంపూర్, నంగనూరు
మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి
2003 నుంచి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అప్పడు డీఎస్సీ ద్వారా ఎంపిక చేశారు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవకాశం కల్పించాలి. ఇన్నాళ్లు కొలువునే నమ్ముకుని బతుకుతున్న మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాల పరిస్థితి ఏం కావాలి ?
-కటకం శ్రీనివాస్, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శి
బీటెక్ తర్వాత
రూ.8 వేలు జీతమిస్తామన్నారు
2011లో బిటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) పూర్తైది. ఇంటర్వ్యూకు వెళ్తే రూ.8 వేలు జీతం ఇస్తామన్నారు. అందువల్లే ఎంటెక్ చేస్తున్నా. అదృష్టం బాగుంటే ఉద్యోగం రావచ్చని దరఖాస్తు వేయడానికి వచ్చాను. మా నాన్న వ్యవసాయం చేస్తారు.
-బి.అంజిరెడ్డి, ఎంటెక్ విద్యార్థి, దుబ్బాక