ది గ్రేట్ ఎస్కేప్
మీర్ లాయక్ అలీ (Mir Laiq Ali) పారిశ్రామిక వేత్త, ఇంజనీర్. 1947 డిసెంబర్ 1న హైదరాబాద్ స్టేట్ (చివరి) ప్రధాన మంత్రిగా నిజామ్ నియమించాడు. యునెటైడ్ నేషన్స్‌లో తమ దేశపు అధికారిక ప్రతినిధిగా పాకిస్థాన్ నియమించింది. 1948 సెప్టెంబర్‌లో ‘పోలీస్ చర్య’ ఫలితంగా హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. హైద్రాబాద్ స్టేట్ చివరి ప్రధాని, పాకిస్థాన్ దౌత్యవేత్త అయిన లాయక్ అలీని బేగంపేటలోని ఓ విశాలమైన ఇంట్లో (ఇప్పటి అమృతామాల్) భారత ప్రభుత్వం నిర్బంధించింది. కాలం గడుస్తోంది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా ఇండియా ఆవిర్భవించింది. లాయక్ భవిష్యత్ అగమ్యం!. పాకిస్థాన్‌కు తరచూ వెళ్లివచ్చే న్యాయవాది అబ్దుల్ కువీ, అలీ భార్య, చెల్లెలితో కూడబలుక్కుని ప్లాన్ వేశారు. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ‘అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు’!
లాయక్ అలీ ‘అనారోగ్యం’!
తనకు కడుపునొప్పి అని ఆగ్రా జైలు సిబ్బందిని నమ్మిస్తాడు ఛత్రపతి శివాజీ! తన ఆరోగ్యం ‘బాగు’ చేసిన వైద్యుల కోసం, జైలు సిబ్బంది కోసం పండ్లు తెప్పించుకుంటాడు. అనుకూలమైన సమయం కోసం వేచి ఉంటాడు! ఖాళీ పండ్ల గంపలలో తాను, తన కుమారుడు ఆగ్రా నుంచి తప్పించుకుంటారు. ఈ ఉదంతంలో ‘అనారోగ్యం’ చిట్కా లాయక్ బృందానికి నచ్చి ఉంటుంది. అధికారులు చరిత్ర చదవరని వారికి తెలుసు! తన భర్తకు అనారోగ్యంగా ఉందని లాయక్ భార్య టాంటాం వేసింది! లాయక్ మంచం ఎక్కాడు! రోజూ అరుపులు, ప్రార్థనలు, వచ్చిపోయేవారు! బంజారాల నాట్య బృందంతో వచ్చే సందర్శకులు కాపలా సిబ్బందికి పండ్లు, స్వీట్లు, ఇతర ఆకర్షణీయ వస్తువులూ అందజేసేవారు. సిబ్బంది ఆడుతూ పాడుతూ ఆనందంగా డ్యూటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాయక్ సమీప బంధువుల వివాహం ఉందని ఒక వాహనాన్ని తెప్పించి నిర్బంధ గృహం నుంచి కొన్ని వస్తువులను పాకిస్థాన్ తరలించేందుకు పరదాలలో తరలించారు!
పరదా కారు!
బేగం సాహెబా ఫౌరన్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలని ఒక పరిచారిక గార్డులతో నమ్మబలికింది. బెడ్‌పై దిండ్లు అమర్చి లాయక్ ‘గృహం’లోనే ఉన్నారనే ఎఫెక్ట్ తెచ్చి బేగం సాహెబా కాపలాదారుల కంటపడకుండా దాక్కుంది. కారు పోర్టికోలోకి రాగానే నిశ్శబ్దంగా లాయక్‌అలీ కారులోకి చేరాడు. కారును నేరుగా తన చెల్లెలు ఇంటికి, మరో కారులో న్యాయవాది ఇంటికి డ్రైవ్ చేశాడు. అసలు కారు ‘గృహోన్ముఖం’ బేగం సాహెబా మందులతో వచ్చేశారహో అంటూ! దాక్కున్న చోటునుంచి బేగం సాహెబా లాయక్ అలీ డమ్మీ పడక వద్దకు వచ్చి, బెడ్‌షీట్స్ మార్చారు. డాక్టరుగారు మందులు మార్చారు, విశ్రాంతి తీసుకోండని పరిచారికలు వినేలా జనాంతికంగా చెప్పింది! తాను సిద్ధం చేసిన పరదా కారులో న్యాయవాది, లాయక్ అలీ, అతని కుమారుడు, చెల్లెలు గుల్బర్గా వైపు దూసుకుపోతున్నారు! నగర పొలిమేరలు దాటాక పరదాలు తొలగించి సిటీ శివారు ప్రాంతాలను లాయక్ అలీ
చివరిసారి చూశాడు!
సికింద్రాబాద్ నుంచి ముంబై వెళే ్లందుకు రైలులో నాలుగు బెర్త్‌లున్న ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్ బుక్కై ఉంది. ప్రయాణికులు గుల్బర్గాలో ఎక్కుతారనడంతో ఇతరులెవరూ ఎక్కకుండా కంపార్ట్మెంట్ను రిజర్వ్ చేశారు. గుల్బర్గా దర్గాలో ప్రార్థనలు చేసి, సాధువుల దర్శనం చేసుకుని నలుగురూ రెలైక్కారు! గులాం అహ్మద్ పేరుతో విమానం ఎక్కిన లాయక్ అలీ ముం‘బై’ నుంచి పాకిస్థాన్ చేరుకున్నారు. లాయక్ అంటే నైపుణ్యం, అని గుర్తు చేస్తూ!
కారు తోసిన పోలీసు పెద్ద!
ఇక్కడ హైదరాబాద్‌లో వేళ తప్పకుండా ‘లాయక్ అలీ’కి బేగం మందులను అందిస్తున్నారు. చివరి ప్రధానమంత్రి ఆరోగ్యం కోసం వైద్యులు, సందర్శకులు, ప్రార్థనలూ షరామామూలు! తనకు విశ్వసనీయులైన అరబ్ సర్వెంట్‌కు బేగం కొత్త కరెన్సీ కట్టలను పుష్కలంగా అందజేశారు! ఫలానా ఫలానా వారికి ఆదివారం ఇవ్వవలసినదిగా సూచించి, తన సోదరుని ఇంటికి కారులో వెళ్లారు. అక్కడ నుంచి ముంబైకి వెళ్లేందుకు పరదాకారులో బేగంపేట బయలుదేరారు! ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లడమే తరువాయి! కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి, స్టీరింగ్ తిప్పుతూ నెడుతున్నాడు! వెనుక కారులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జైటీ ్ల ! పరదాకారులో నగర ప్రముఖులు ఇబ్బందిపడుతున్నారనే కారుణ్యంతో కిందకు దిగి ‘హైలెస్సా’ అన్నారు! లాయక్ విమానంలో ఎగిరిపోతే ఆయన కుటుంబం ‘ఎస్.ఎస్.సబర్మతి’ అనే పడవలో కరాచీ చేరుకుంది!
పాకిస్థాన్ రేడియో ఉవాచ!
పాకిస్థాన్‌లోని ఇండియా హౌస్‌లో ఒక విందులో లాయక్ అలీ కన్పించారని తొలిసారిగా పాకిస్థాన్ ఆకాశవాణిలో ప్రతిధ్వనించింది! ‘ఇది నిజమా?’ అని అక్కడి భారత రాయబారి శ్రీప్రకాశ కేంద్ర హోంమంత్రి వల్లభాయ్ పటేల్‌కు ఫోన్ చేశారు! ‘లేదే’ అన్నారు ఉక్కుమనిషి! విచారించగా ‘క ట్టుకథ’ వెల్లడైంది! లాయక్ శ్రీమతి, సోదరి షౌకత్ ఉన్నీసా, న్యాయవాదిపై, కొందరు అధికారులపై, ఉద్యోగులపై ప్రభుత్వం కేసు పెట్టింది. భారత ప్రభుత్వం గణతంత్ర రాజ్యం అయిన నేపథ్యంలో, పూర్వరంగంలోని వ్యక్తులపై చేసిన అభియోగాలు పరిశీలించలేమని కోర్టు చెప్పింది! అక్టోబర్ 24వ తేదీకి లాయక్ అలీ మరణించి 44 ఏళ్లు అవుతోంది. న్యూయార్క్ నగరంలో ఉదయం పూట ప్రార్థన చేస్తూ మరణించిన అతడి పార్థివ దేహాన్ని సౌదీ అరేబియాలోని మదీనాకు తరలించి విశ్రమింపజేశారు!
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి