కొవ్వు నుంచి ముక్కు, చెవులు!
లండన్: శరీరంలోని కొవ్వు నుంచి ముక్కు, చెవులు, ఎముకలను తయారు చేసే వినూత్న టెక్నిక్‌ను లండన్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు ఆవిష్కరించారు. పిల్లల శరీరంలోని కొవ్వు నుంచి మూలకణాలు సేకరించి వాటితో మృదులాస్థిని తయారు చేయవచ్చని, ఆ మృదులాస్థిని మూసలలో అభివృద్ధిపర్చి చెవి, ముక్కు వంటి అవయవాలను రూపొందించవచ్చని వారు అంటున్నారు.
పుట్టుకతోనే చెవులు, ముక్కు సరిగ్గా ఏర్పడని పిల్లలకు, కేన్సర్ వంటి వ్యాధుల వల్ల ముక్కు వంటి మృదులాస్థి అవయవాలు దెబ్బతిన్నవారికి ఈ పద్ధతిలో ఆయా అవయవాలను తయారు చేసి అమర్చవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం బయటి చెవులు సరిగా ఏర్పడని పిల్లలకు వారి పక్కటెముకల నుంచి మృదులాస్థిని సేకరించి చె వులు తయారు చేస్తున్నారు. అయితే దీనివల్ల వారి ఛాతీపై శాశ్వత గాయం ఏర్పడటంతోపాటు పక్కటెముకను పునరుద్ధరించడం సాధ్యం కావడం లేదు. ఇలాంటివారికి తాము కనుగొన్న పద్ధతి బాగా ఉపయోగపడనుందని వైద్యులు చెబుతున్నారు.