తిరిగి దక్కించుకునేదెలా?
హోమీబాబా బంగ్లాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
సాక్షి, ముంబై: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీబాబా బంగ్లాను తిరిగి దక్కించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే వేలం వేసిన ఈ బంగ్లాను తిరిగి దక్కించుకొని, దానిని మ్యూజియంగా మార్చాలని యోచిస్తున్నాయి. అయితే వేలం వేసిన బంగ్లాను దక్కించుకునే విషయమై నిపుణుల నుంచి న్యాయసలహాలు తీసుకుంటున్నాయి.
అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా ఇరు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. హోమీబాబాకు చెందిన ‘మెహరంగీర్’ బంగ్లాకు హెరిటేజ్ హోదా కల్పించి దాన్ని మ్యూజియంగా మార్చాలని కోరుతూ వివిధ సేవాసంస్థలు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశాయి. అయితే కోర్టు నుంచి తీర్పు రాకముందే ‘నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ (ఎన్సీపీఏ) కొద్ది రోజుల కిందటే ఈ బంగ్లాను రూ.372 కోట్లకు వేలంలో విక్రయించింది.
కాగా ఈ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆటమిక్ ఎనర్జీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ అధ్యక్షుడు ప్రశాంత్ వర్లీకర్, నేషనల్ ఫోరమ్ ఫర్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయిస్(న్యూక్లియర్ శాఖ) అధ్యక్షుడు రామ్ధురి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎటువంటి తీర్పును ఇవ్వకముందే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చేందుకు కేంద్రం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు సంబంధించిన లేఖను ప్రధాని కార్యాలయం, న్యాయశాఖకు పంపింది. వేలంలో విక్రయించిన బాబా బంగ్లాను దక్కించుకునేందుకు న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని న్యాయశాఖను కోరింది. కాగా న్యాయశాఖ కూడా ఈ విషయమై అధ్యయనం చేస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బాబా బంగ్లాను వారసత్వ కట్టడంగా గుర్తించి, దాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యూక్లియర్ కమిషన్ డిమాండ్ చేసింది. ఈ కట్టడాన్ని మ్యూజియంగా మారిస్తే హోమీ బాబాకు మరింత గౌరవం కల్పించినట్లవుతుందని పేర్కొంది.
మేధావుల అభ్యంతరం...
హోమీబాబా బంగ్లాను మ్యూజియంగా మార్చాలనే డిమాండ్ వినిపించడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోమీబాబా నివసించినట్లుగా చెబుతున్న ‘మెహరంగీర్’ బంగ్లాను మ్యూజియంగా మార్చాలని కోరుతున్నవారికి చరిత్ర తెలియదని వాదిస్తున్నారు. నిజానికి మెహరంగీర్ బంగ్లాలో బాబా కొన్నిరోజులు మాత్రమే నివసించారని, ఆయన పెడ్డర్ రోడ్డులోని కెనిల్వర్త్లోనే ఎక్కువ రోజులు గడిపారని చెబుతున్నారు.