సమైక్యమే శ్వాస... ధ్యాస
సాక్షి, అనంతపురం: సమైక్య నినాదం పల్లెల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. ఉద్యమకారులు విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. తెలుగుజాతిని విడదీసే కుట్రల్ని సాగనివ్వబోమంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు చేయిచేయి కలిపి కదం తొక్కుతుండడంతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది.
జిల్లా వ్యాప్తంగా 61వ రోజైన ఆదివారం కూడా సమైక్యవాదులు పెద్దఎత్తున కదంతొక్కారు. అనంతపురం నగరంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు చేతులు కట్టేసుకుని ర్యాలీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, పోస్టల్ ఉద్యోగులు ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులసంఘాల జేఏసీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల సిబ్బంది ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఎస్కేయూలో విద్యార్థులు, జేఏసీ నాయకులు గంజి తాగుతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు బూట్లు పాలీష్ చేస్తూ.. చెప్పులు విక్రయిస్తూ నిరసన తెలిపారు. గుత్తిలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ చేశారు. పామిడిలో జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు.
హిందూపురంలో ఏపీఎన్జీఓలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరు ఎస్సీ కాలనీలో జేఏసీ నాయకులు రచ్చబండ నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో తలుపుల మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. టీచర్ రవీంద్రారెడ్డి కోయదొర వేషధారణలో రాళ్లు, గడ్డి, కలబంద విక్రయించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన, మానవహారం చేపట్టారు.
మడకశిరలో సమైక్యవాదులు చీపుర్లు పట్టుకుని, రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు రాళ్లు మోస్తూ నిరసన తెలిపారు. అలాగే సోమవారం సమైక్య సమరభేరి సదస్సు నిర్వహించనున్నారు. నల్లమాడలో సర్పంచులు, పెనుకొండ, ఉరవకొండలో జేఏసీ నాయకులు, రాయదుర్గంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పుట్లూరులో సమైక్యవాదులు, కూడేరులో విద్యార్థి జేఏసీ నాయకులు, అమరాపురంలో ఉపాధ్యాయులు ర్యాలీలు చేపట్టారు. జేఏసీ నాయకులు రొద్దంలో పాదయాత్ర, సోమందేపల్లిలో జాతీయ రహదారిపై మాదేచెరువు గ్రామస్తులతో కలిసి రాస్తారోకో, గోరంట్లలో ఆటా పాట కార్యక్రమాలు చేపట్టారు.
రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేసి.. తెలంగాణ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమై సూచించారు. కణేకల్లులో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నడుస్తూ నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఏపీఎన్జీఓలు నిర్వహించిన ‘మహాగర్జన’కు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు.
శింగనమలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పోస్టర్లు విడుదల చేశారు. జేఏసీ నాయకులు గడ్డితింటూ నిరసన తెలిపారు. తాడిపత్రిలో జేఏసీ, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో పీహెచ్సీ వైద్యులు రిలేదీక్షలు చేపట్టారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజన ఆగేదాకా పోరుబాట ఆపే ప్రసక్తే లేదంటూ ప్రతిజ్ఞ చేశారు.