వంట గ్యాస్‌పై రూ.5 డిస్కౌంట్!
ఆన్లైన్ ద్వారా రీఫిల్ చెల్లింపులకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రధాన చమురు సంస్థలు మరో అడుగు ముందుకు వేశాయి. పెద్ద నోట్ల రద్దుతో పెట్రోల్, డీజిల్‌కు డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. నూతన సంవత్సరం కానుకగా ఆన్లైన్లో చెల్లించే వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ ధరపై రూ.5 డిస్కౌంట్ ప్రకటించాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఇప్పటికే తమ వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపించింది. ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీలు నగదు రహిత లావాదేవీలకు దూరంగా ఉన్నాయి. దీంతో కొందరు డెలివరీ బాయ్స్ రూ.2వేల నోటకు చిల్లర లేదంటూ సిలిండర్ వెనక్కు తీసుకెళ్లిపోతున్నారు. తిరిగి గ్యాస్ బుక్ చేసుకొని, సరిపడా చిల్లర పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించా యి. ఆన్లైన్ చెల్లింపుల వల్ల సిలిండర్ డెలివరీ సమయంలో చిల్లర ఇబ్బందులూ తప్పుతాయి.
రోజుకు 60 వేల సిలిండర్లు...
చమురు సంస్థలు నిర్దేశించిన ధరతో బిల్లింగ్ చేస్తున్న గ్యాస్ డీలర్లు... డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాలిస్తున్నాయి. దీంతో కొందరు డెలివరీ బాయ్స్ బిల్ మొత్తంపై రూ.20–రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపు అందుబాటులోకి వస్తే... డెలివరీ బాయ్ భారం తమపై పడుతుందని ఏజెన్సీలు స్వైపింగ్ యంత్రాలను దూరం పెట్టాయి. నిబంధనల ప్రకా రం క్యాష్ బిల్లుపై అదనపు చార్జీలూ వసూలు చేయకూడదు. ఎవరైనా డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము డిమాండ్ చేస్తే పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో 3 ప్రధాన కంపెనీలకు చెందిన వంటగ్యాస్ కనెక్షన్లు 29.18 లక్షలున్నాయి. సుమారు 115 గ్యాస్ ఏజె న్సీలకు రోజూ 80 వేల బుకింగ్‌లు అవు తుండగా, 60 వేల సిలిండర్లు డెలివరీ చేస్తున్నాయి.
ఆన్లైన్ చెల్లింపులు చేయాలి...
నగదు రహిత లావాదేవీల్లో భాగంగా వంట గ్యాస్ రీఫిల్ ధర ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఫిల్ ధరపై రూ.5లు డిస్కౌంట్‌ను ప్రధాన చమురు సంస్థలు ప్రక టించాయి. దీనివల్ల చిల్లర కష్టాలూ ఉండవు.
– అశోక్‌కుమార్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డీలర్ల సంఘం, హైదరాబాద్