ఇది కొలవెరి కాదు.. 'కోహ్లి'వెరి!
'వై దిస్ కొలవెరి.. కొలవెరి డీ' అంటూ అప్పట్లో ధనుష్ ఇంటర్నెట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పరుగుల సునామీతో విరాట్ కోహ్లి అంతే దుమారం రేపుతున్నాడు. తాజాగా ఈ బెంగళూరు కెప్టెన్ పుణెతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది.. కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే ఐపీఎల్లో రెండు సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో క్రిస్ గేల్ ఒకే ఐపీఎల్ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించాడు.
ఈ సిరీస్‌లో గత నెల 24న గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి నాటౌట్‌గా 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసినా బెంగళూరు జట్టు ఓడిపోయింది. తాజాగా శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి 58 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. ఏడు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లతో కోహ్లి వీరవిహారంతో బెంగళూరు జట్టు పుణెపై అలవోకగా విజయాన్ని సాధించింది.
తీరని పరుగుల దాహంతో మైదానంలో అడుగుపెడుతున్న కోహ్లి రికార్డుల పరంపర ఇక్కడితో ఆగిపోలేదు. మూడు ఐపీఎల్ ఎడిషన్లలోనూ 500లకుపైగా పరుగులు చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. తాజా సిరీస్‌లో ఇప్పటివరకు 541 పరుగులు చేసిన ఆయన 2015లో 505 పరుగులు, 2013లో 634 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ రెండుసార్లు 500లకుపైగా పరుగులు చేశాడు. 2011లో 553, 2010లో 618 పరుగులు ఆయన చేశాడు. సచిన్ రికార్డును తాజాగా కోహ్లి అధిగమించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు కూడా ఆయన పేరిట ఉంది. ఒక కెప్టెన్‌గా కోహ్లి 2013లో 634 పరుగులే అత్యధికం.
పేరుకు అనేకమంది స్టార్ ఆటగాళ్లు ఉన్న బెంగళూరు జట్టు గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ తనదైన పరుగుల వరదతో తిరిగి జట్టును విజయాల ట్రాక్‌లోకి తీసుకురావడంతో అతన్ని బెంగళూరు జట్టు సభ్యులు వేనోళ్లతో కొనియాడుతున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా కోహ్లి బ్యాటింగ్ ను కొనియాడుతున్నారు. అన్ని ఫార్మెట్లలోనూ కోహ్లి ఆల్‌టైమ్ గ్రేట్ ఛేజర్ అని, అతను జట్టులో ఉండటం వల్ల ఛేజింగ్ అనేది చాలా సులువుగా మారిపోయిందని బెంగళూరు క్రికెటర్ షేన్ వాట్సన్ కోహ్లిని ప్రశంసించాడు.