రాష్ట్ర మార్కెట్లోకి గ్రీ ఎయిర్ కండీషనర్లు
ధరల శ్రేణి రూ.24,000 - రూ.1.40 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర ఎయిర్ కండీషన్ మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్ ‘గ్రీ’ వచ్చి చేరింది. శనివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో గ్రీకి చెందిన కొత్త ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ జిమ్మీ జోస్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో 30 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం 25,000 యూని ట్లను విక్రయించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియా రెసిడెన్షియల్ ఏసీ మార్కెట్ 35 లక్షల యూనిట్ల అమ్మకాలతో రూ.7,500 కోట్లుగా ఉందన్నారు.
వీటి ధరలు రూ.24,000 నుంచి రూ.1.40 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు. సోలార్ ఎయిర్ కండీషనర్లపై బెంగళూరులో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, వచ్చే రెండేళ్లలో వాణిజ్యపరంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో గ్రీ ఉత్పత్తులను విక్రయించడానికి సెర్వోమాక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.