మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
ఏథెన్స్: ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న గ్రీస్‌లో ఓ మంత్రి నివాసంపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. గత రెండు నెలల్లో మంత్రి నివాసంపై దాడులు జరుగడం ఇది రెండోసారి. సెంట్రల్ ఏథెన్స్లోని హోంమంత్రి అలెకోస్ ఫ్లాంబౌరరీస్ నివాసంపై శనివారం జరిగిన పెట్రోల్ బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. ముసుగులతో వచ్చిన వ్యక్తులు ఆయన నివాసం ప్రవేశద్వారం వద్ద పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో ఇంటి బయట ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇంటి కిటికిల అద్దాలు కూడా పగిలిపోయాయి.
గ్రీస్‌లో ఇటీవల స్వదేశీ ఉగ్రవాదంతో సమమతమవుతోంది. దేశీ తీవ్రవాదులు ఇటీవలకాలంలో సంప్రదాయ, సామ్యవాద పార్టీలను లక్ష్యంగా చేసుకోగా.. తొలిసారి రాడికల్ వామపక్ష పార్టీ అయిన సిరిజా నేతలపైనా దాడులు జరుపుతున్నారు. గతంలోనూ మంత్రి ఫ్లాంబౌరరీస్ లక్ష్యంగా బాంబు దాడులు చేశారు.