Green Carpet
-
రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలోని నూతన పార్లమెంట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన ప్రారంభాన్ని బహిష్కరించేందుకు 19 విపక్షపార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణ శైలి, హంగుల గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అధికార బీజేపీ పక్షం నూతన పార్లమెంట్ భవన నిర్మాణం మొదలుకొని వివిధ అంశాలలో రికార్డులు నెలకొల్పిందని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలలో రాజ్యసభ హాలులో రెడ్ కార్పెట్, లోక్‌సభ హాలులో గ్రీన్ కలర్ కార్పెట్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చాలామంది దీనిని డిజైన్ అని అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ విధానం నూతన పార్లమెంట్‌లోనే కాదు పాత పార్లమెంట్ భవనంలోనూ కొనసాగింది. కొత్త భవనంలో పలు మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కార్పెట్ రంగుల విషయంలో ఎటువంటి మార్పులేదు. పార్లమెంట్‌లోని ఉభయ సభలకు భిన్నమైన ప్రత్యేకత ఉంది. రెండు సభలలో సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలోనూ ఎంతో తేడా ఉంది. లోక్‌సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నికయినవారై ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ విషయానికొస్తే సభ్యులను ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు. లోక్‌సభ సభ్యులంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే వీరు కింది స్థాయి(నేల)తో విడదీయరాని అనుబంధం కలిగివుంటారు. భూమితో ముడిపడివున్న వ్యవసాయానికి గుర్తుగా పచ్చరంగును పేర్కొంటారు. అందుకే లోక్‌సభలో పచ్చరంగు కార్పెట్ వినియోగిస్తారు. రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఎందుకంటే.. రాజ్యసభలోని సభ్యులు.. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనవారై ఉంటారు. వీరి ఎంపిక ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. ఎరుపు రంగును గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. రాజ్యసభలోని ప్రజాప్రతినిధులను ప్రత్యేక సభ్యులుగా గుర్తిస్తారు. అందుకే రాజ్యసభలో ఎరుపురంగు కార్పెట్‌ను వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్ -
గ్రీన్ కార్పెట్‌తో ‘గ్లోబల్’కు కాలేయం తరలింపు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా.. లివర్‌ను గ్రీన్కార్పెట్తో హైదరాబాద్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించి ఓ వ్యక్తికి అమర్చారు. విశాఖపట్నం నివాసి సత్యనారాయణ (53) ఈ నెల 26న రోడ్డుప్రమాదానికి గురవగా.. అక్కడి సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు తరలించారు. 27న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ కష్ణమూర్తిల సహకారంతో అవయవదానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా మంగళవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్లు మాథ్యూ జేకబ్, డాక్టర్ రాఘవేంద్ర, మురగన్ రాజన్నల బృందం అవయవాలను శరీరం నుంచి వేరు చేశారు. ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. లివర్‌ను గ్రీన్ కార్పెట్ సాయంతో లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో నగరంలో నివాసముండే 63 ఏళ్ల వ్యక్తికి లివర్‌మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్ హీరేంద్రనాథ్ తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల పోలీసులు లివర్ తరలించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం వల్లే సకాలంలో హాస్పిటల్‌కు లివర్‌ను తరలించగలిగామని తెలిపారు.