green category
-
ఆగస్టు 1 నుంచి హజ్‌యాత్ర
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2018 షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి ప్రయాణం ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం ఉమ్రాయాత్ర ముగించుకొని నగరానికి చేరుకున్నారు. గురువారం తన కార్యాలయంలో 2018 హజ్‌యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హజ్‌కమిటీ ఎంపిక చేసినవారు ఆగస్టు 1 నుంచి 16వ తేదీ వరకు హజ్‌యాత్రకు వెళతారన్నారు. ఈ ఏడాది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు యాత్రికులు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా వెళ్లనున్నట్లు తెలిపారు. మొత్తం 16 విమానాల ద్వారా దాదాపు 6 వేల మంది యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అజీజియా, రుబాత్ కేటగిరీ వారికి వంట చేసుకునే సౌకర్యం ఉందని, గ్రీన్ కేటగిరీ వారికి ఈ సౌకర్యం లేదని పేర్కొన్నారు. రూ.రెండు వేలు అదనంగా వసూలు చేస్తుండడంతో రాష్ట్ర యాత్రికులకు భారమవుతోందని, ఈ విషయమై పునరాలోచించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. యాత్రకు వెళ్లే ముందే యాత్రికులకు సిమ్‌కార్డులు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. -
హజ్ ఫీజు చెల్లింపునకు 19 తుది గడువు
– జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ యాత్రికులు రెండో విడత ఫీజు చెల్లింపునకు ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉంటుందని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రీన్ కేటగిరీ హజ్ యాత్రికులు రూ. 1,54,150 (ఖుర్బానీతో అయితే రూ. 1,62,150) చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే అజీజియా కేటగిరీలో రూ. 1,20,800 (ఖుర్బానీతో అయితే రూ. 1,28,800) చెల్లించాలన్నారు. జిల్లా హజ్ కమిటీ వారి వద్ద చలానా ఫారాలు తీసుకెళ్లి డబ్బును స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించాలని కోరారు. చలానా ఫారాలు పెద్దమార్కెట్ సమీపంలోని అబూబకర్ మసీదులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు లభిస్తాయని తెలిపారు.