హుషారుగా హ్యాపీ సండే
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రజలు బందర్ రోడ్డు పై నిర్వహించిన హ్యాపీసండే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, సంగీతం, నృత్యాలతో యువత అందరినీ అలరించారు.
వివిధ స్వచ్ఛంద సంస్థలు , వాకర్స్ అసోసియేషన్లు, కాలనీ కమిటీలు, యూత్ అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపైన కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్, స్కేటింగ్ వంటి అంశాలను ప్రదర్శిస్తూ క్రీడాకారులు అందరిని అకట్టుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ గ్రీన్ఎర్త్ సొసైటీలు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాయి. మట్టి వినాయకుడిని పూజించాలంటూ ప్రచారం నిర్వహించాయి.
పాప్ గీతాలు, సినీ సంగీతంతో కళాకారులు అందరినీ అలరించాయి. పలు కళాశాల, పాఠశాల విద్యార్థులతో పాటు నగర ప్రజలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ట్రాఫిక్ డీసీపీ కాంతిరాణా టాటా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.