క్యూఐబీ ద్వారా జీవీకే 1,000 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ. 694 కోట్ల ఆదాయంపై రూ.235 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 500 కోట్ల ఆదాయంపై రూ. 171 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. తగినంత గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, అధిక వడ్డీరేట్లు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. 2013-14 పూర్తికాలానికి రూ. 2,820 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా, అంతక్రితం ఏడాది రూ. 2,608 కోట్ల ఆదాయంపై రూ. 336 కోట్ల నికర నష్టం వచ్చింది. ఎయిర్పోర్ట్ విభాగం తప్ప విద్యుత్, రహదారుల విభాగాలు నష్టాల్లోనే ఉన్నాయి. క్యూ4లో ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు రూ. 155 కోట్ల నుంచి రూ. 211 కోట్లకు పెరిగింది.
క్యూఐబీకి ఓకే
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు వాటాలను విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ. 1,000 కోట్ల వరకు మూలధనం సమీకరించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోనే గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.500 కోట్లు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.