వీవీఐపీ రోడ్లకు డబ్బుల్ ధమాకా
=వేసిన రోడ్లే మళ్లీ వేయడం
=మిగతా వాటిపై తీవ్ర నిర్లక్ష్యం
=ఏడు రహదారులపైనే మోజు!
=ఇదీ జీహెచ్ఎంసీ తీరు..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు.. కొత్త రోడ్ల పనులపై తాజాగా మరోమారు దృష్షి సారించారు. తొలి ప్రాధాన్యత క్రమంలో ఏడు రోడ్లను ఎంపిక చేశారు. ఈ ఏడు మార్గాల్లోని రహదారులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంతో పాటు .. మార్గానికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, వరదనీటి కాలువలు, ఇతరత్రా సదుపాయాలతోపాటు పచ్చదనం పెంపు కార్యక్రమాలకూ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంత ఖర్చవుతుందో అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలందాయి.
ఆయా విభాగాలు ప్రస్తుతం ఆ పనిలో తలమునకలై ఉన్నాయి. ఈ రహదారులను తీర్చిదిద్దితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. గ్రేటర్‌లోని అన్ని రోడ్లలో ఇవే అంతో ఇంతో మెరుగ్గా ఉన్నాయి. వీటితోపాటు పరమ అధ్వానంగా ఉన్న మరికొన్ని రోడ్లకు ప్రాధాన్యం కల్పించి ఉంటే ప్రజలకు మేలు కలిగేది. అంతేకాదు, గత సంవత్సరం సీఓపీ సందర్భంగా ఈ మార్గాల్లోనే పనులు చేశారు. మళ్లీ ఇప్పుడు వాటికే కొత్తందాలు దిద్దేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడు సమయం లేనందున, హడావుడి కారణంగా ఫుట్‌పాత్‌ల వంటివి పూర్తి కాలేదని చెబుతున్నారు. వాటినిప్పుడు పూర్తి చేస్తామంటున్నారు.
మిగతా ప్రాంతాలవి ఎందుకు పట్టించుకోవడం లేదంటే మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. సమగ్రంగా రహదారుల అభివద్ధి పనులు చేపట్టాలన్నది లక్ష్యమని, వాటిని ఎక్కడో ఒకచోట ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు వీటిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. కానీ.. కారణం అందరికీ తెలిసిందే. ఇవన్నీ వీవీఐపీలు.. సంపన్నులు అధికంగా సంచరించే మార్గాలు. గ్రీన్‌ల్యాండ్స్ మార్గం సీఎం క్యాంప్ కార్యాలయానికి దారి తీసేది కాగా, రాజ్భన్కున్న ప్రాధాన్యత తెలిసిందే. ఇక అసెంబ్లీ.. సైఫాబాద్ప్రాంతాలు మంత్రులు, ఎమ్మెల్యేలు సంచరించే మార్గాలు. బంజారాహిల్స్ అమాత్యులతోపాటు బడాబడా సంపన్నులు తిరిగే మార్గాలు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి తీసేవి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఆరాంఘర్ మార్గాలు. అవి ఎవరి కోసమో తెలిసిందే. ఇలా.. వీఐపీలను ఆకట్టుకోవడానికి అత్యంత శ్రద్ధ చూపుతున్న అధికారులు.. సామాన్య జనం సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ప్రజలంతా ఆస్తిపన్ను చెల్లిస్తున్నప్పుడు అధికారులు కొందరికి మాత్రమే అదనపు సదుపాయాలు సమకూర్చడం.. సామాన్యుల మార్గాలు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 20 శాతం సంపన్నులపైనే శ్రద్ధ చూపుతూ 80 శాతం సాధారణ ప్రజల్ని విస్మరించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మూణ్నాళ్లకే మళ్లీ పనులు
పై ఏడు మార్గాల్లో ఒకటీ రెండూ మినహా మిగతా మార్గాలన్నింటిలో గత సంవత్సరం సీఓపీ సందర్భంగానూ పనులు చేశారు. అప్పుడు చేసిన పనుల్లో పూర్తికానివి ఇప్పుడు పూర్తి చేస్తామంటున్నారు. అప్పట్లో పనులు చేయని కాంట్రాక్టర్లకు తిరిగి పనులివ్వమని చెబుతున్నారు. ఫుట్‌పాత్‌లు.. వరదనీటి కాలువలు తదితరమైనవి వేరేవారికి అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. రహదారులు చేసిన వారే తిరిగి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున వాటిని మాత్రం సీఓపీ సందర్భంగా చేసిన వారితోనే చేయిస్తామని చెబుతున్నారు. ఇవి ఏమేరకు ఆచరిస్తారో సంబంధిత అధికారులకే తెలియాలి. కోట్లాది రూపాయలు వెచ్చించి చేసిన పనులనే తిరిగి మూణ్నాళ్లకే చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.
కొత్త సోకులు వీటికే...
1. రాజ్‌భవన్ రోడ్డు
2. గ్రీన్లాండ్స్ రోడ్డు
3. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్
4. బంజారాహిల్స్ రోడ్డు నెం. 1, 2, 3
5. సైఫాబాద్, అసెంబ్లీ పరిసరాలు
6. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే
7. ఆరాంఘర్- శంషాబాద్ (జీహెచ్ఎంసీ పరిధి వరకు)