‘గ్రీన్‌ల్యాండ్స్-శిల్పారామం’కు పచ్చజెండా
మెట్రోపై సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు ధర్మాసనం
అలైన్మెంట్ మార్చారన్న వాదనలు తిరస్కృతి
ఆధారాలు చూపలేదని స్పష్టీకరణ
జేఏసీ పిటిషన్లు కొట్టివేత.. మెట్రో అప్పీళ్లకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్-శిల్పారామం సెగ్మెంట్లో మెట్రో రైల్ నిర్మాణ పనులకు అడ్డం కులు తొలగిపోయాయి. ఈ మార్గంలో పనులపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి 2012, మార్చి 15న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే మెట్రోరైల్ కారిడార్ 3 అలైన్‌మెంట్‌ను మార్చారంటూ పిటిషనర్లు చేసిన ఆరోపణను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మెట్రోరైల్ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కారిడార్ 3 అలైన్‌మెంట్‌ను మార్చారంటూ గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, యూసఫ్‌గూడ, కృష్ణానగర్ జాయింట్ యాక్షన్ కమిటీ; మరో 20 మంది 2012లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి గ్రీన్‌ల్యాండ్స్-శిల్పారామం సెగ్మెంట్లో మె ట్రో పనులను నిలుపుదల చేశారు.
వీటిని సవా లుచేస్తూ మెట్రోరైల్ ఎండీ, ప్రభుత్వం కలసి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై పూర్తిస్థాయిలో వాదనలు విని ఇటీవల తీర్పును వా యిదావేసిన ధర్మాసనం గురువారం పై విధంగా తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో పర్యావరణ అనుమతులు పొందకుండానే మెట్రో పనులు చేపట్టారంటూ సామాజిక కార్యకర్తలు దేబ్ర, రామచంద్రయ్యలు 2008లో దాఖలు చేసిన పిల్‌ను, మెట్రోరైల్, ఎల్అండ్టీలకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మానవ హక్కుల ఫోరం అధ్యక్షుడు జీవన్‌కుమార్ 2011లో దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది.