హైస్కూల్లో అగ్ని ప్రమాదం
గోనెగండ్ల ,న్యూస్‌లైన్ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సైన్స్‌ల్యాబ్, మధ్యాహ్న భోజన పథకం వంట సామగ్రి కాలి బూదిదయ్యాయి. సాయంత్రం 5.30 గంటల తర్వాత పాఠశాల సిబ్బంది గదులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. మూడు బస్తాల బియ్యం, నూనెడబ్బాలు, ఇతర వస్తులు కాలిపోయాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ల్యాబ్ కు వ్యాపించడంతో అందులో పర్నీచర్, కెమికల్స్, ఇతర వస్తువులు బూడిదయ్యాయి. ఎస్ఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆయన సమాచారం మేరకు ఎమ్మిగనూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనలో రూ. 1.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీవారు చెప్పగా ల్యాబ్‌లో రూ. 2లక్షల నష్టం జరిగిందని హెచ్ఎం గ్రేసమ్మ తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది..
స్కూల్లో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. గదిలో ఓవైపు ల్యాబ్ ఉండగా దానికి అడ్డుగా ఇనుప రేకులు పెట్టి ఏజెన్సీవారు వంట సామగ్రీ పెట్టుకునేందుకు వినియోగిస్తున్నారు. మధ్యాహ్నమే వంట ముగించిన ఏజెన్సీవారు మిగతా కట్టెలు, సామాన్లను అందులో పెట్టారు. ఒకవేల అందులో నిప్పు ఉండి ఉంటే పాఠశాల సమయంలో ప్రమాదం జరిగి ఉండేది. అలా కాకుండా తలుపులు మూసిన అరగంట తర్వాత ప్రమాదం జరగడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇనుప వాకిళ్ల కింద నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారేమో అని అనుమానిస్తున్నారు.