Greyhounds forces
-
ఐదుగురు మావోల కోసం జల్లెడ
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్లో ఒక మహిళ సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పరారైన మిగతా ఐదుగురి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాజేడు, వెంకటాపురం(కె)తో పాటు ఇటు మహారాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం, మంథని మహాదేవ్‌పూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు గాలిస్తున్నా యి. తప్పించుకున్న మావోయిస్టులకు గాయాలై ఉంటాయని, సమీప అటవీ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారని భావిస్తున్న పోలీసులు సోమవారం చెల్పాక అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక వైపు పొలకమ్మ వాగు, మరోవైపు దట్టమైన అటవీప్రాంతం ఉండటంతో పోలీసులు నలుమూలలా నిఘా వేసినట్లు తెలుస్తోంది. సామాజిక ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తుఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక సామాజిక ఆస్పత్రిలో సోమవారం పోççమార్టం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటు చేసుకోగా, ఎస్పీ శబరీష్ మృతదేహాలను పరిశీలించిన తర్వాత భారీ బందోబస్తు మధ్య ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించాలని భావించారు. కానీ వర్షం, భద్రత కారణాల దృష్ట్యా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్ర పర్చారు. సోమవా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం ప్రత్యేక పర్యవే క్షణ అధికారి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో కాకతీయ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌కు మార్, డీఎస్పీ రవీందర్‌రెడ్డితో చర్చించిన తర్వాత.. కాకతీ య వైద్య కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, ప్రొఫెసర్ ఖాజామొహినొద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ వైద్యులు నవీన్, మాధురి, మౌనిక, జీతేందర్, ప్రియాంక, ఫరేక, లావణ్య, తరుణ్, ప్రశాంత్‌లతో కూడిన బృందం ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. మధ్యాహ్నం 12.47 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 6.33 వరకు కొనసాగింది. అనంతరం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మావోయిస్టుల మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపర్చారు. వైద్యులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోస్టుమార్టం గది వద్ద ఉండేందుకు కూడా వీల్లేకుండా కట్టుదిట్టం చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి ఆస్పత్రి వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనదారులను అడ్డగించి ఆరా తీశారు. విషం పెట్టారు.. హింసించి చంపారుశరీరం మొత్తం తుక్కు తుక్కు చేశారుమావోయిస్టు మల్లయ్య భార్య మీనా ఆరోపణఏటూరునాగారం: ‘ఇది ఎన్కౌంటర్ కాదు.. అన్నంలో విషం పెట్టి బేహోష్ (అపస్మారకస్థితిలో)లో ఉన్నప్పుడు నా భర్తను పట్టుకున్న పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారు..’ అని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా ఆరోపించారు. ములుగు ఎన్కౌంటర్లో మరణించిన తన భర్త మృతదేహాన్ని చూడటానికి మీనా, సోదరుడు రాజయ్య ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మీనా విలేకరులతో మాట్లాడారు. ‘ముఖంపై చర్మం తప్ప శరీరంలో ఎక్కడా బొక్కలు కనబడటం లేదు.. మొత్తం తుక్కుతుక్కు చేసి హింసించి హింసించి చంపారు. తల నుజ్జునుజ్జుగా అయింది. దగ్గరినుంచే కాల్చి చంపినట్లు తెలుస్తోంది. హింసించి విషమిచ్చి చంపారా? లేక మత్తుమందు ఇచ్చి అతిక్రూరంగా చంపారా? అనేది అర్థం కావటం లేదు. మరణించిన మహిళా మావోయిస్టును చూస్తే.. మొత్తం బట్టలు చింపేసి గొంతు కోసినట్లుగా ఉంది.. ఒక భుజం మొత్తానికే వెనక్కి తిరిగి ఉంది. ఎంత క్రూరంగా హింసించి చంపారో దీన్నిబట్టి అర్థమవుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి సీతక్క గతంలో నక్సల్స్ పార్టీలో పని చేశారు కదా.. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లకు ఎలా మద్దతు తెలుపుతున్నారని మీనా ప్రశ్నించారు. కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదంటేనే ఎంత క్రూరంగా హింసించి చంపారో తెలుస్తోందంటూ విలపించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గొప్పోడి అంజమ్మ డిమాండ్ చేశారు. -
ఇటు మావోయిస్టులు.. అటు గ్రేహౌండ్స్ బలగాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మావో యిస్టుల కార్యకలాపాలు, మరోవైపు గ్రేహౌండ్స్ బలగాల గాలింపు చర్యలు అటవీ పల్లెల్లో అలజడి రేపుతున్నాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్– తెలం గాణ అంతర్రాష్ట్ర సరిహద్దులోని భద్రాచలం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రచారం చేశారు. పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. నెలన్నర రోజులుగా మావోల కదలికలు గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోల కదలికలున్నాయని పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోలు పాత వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నారన్న ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు బలగాలను మోహరించాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలో గిరిజన సమస్యలపై దృష్టి సారించిన మావోయిస్టులు.. పూర్వ వైభవం కోసం కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పక్షం రోజుల క్రితం తెలంగాణ కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఆధ్వర్యంలో డివిజన్, జిల్లా నాయకులు సుమారు 40 మంది ఛత్తీస్‌గఢ్ –తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గోదావరి పరీవాహక ప్రాంతం చర్ల, ఎదిరె(జీ) సమీప అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ జిల్లాలకు కలిపి (కె.కె.డబ్ల్యూ) ఉన్న డివిజనల్ కమిటీని రద్దు చేసి.. కొత్తగా 3 డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులయ్యారు. నూతన కమిటీలు.. కార్యదర్శులు మార్పులలో భాగంగా పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. మంచిర్యాల–కొమురంభీం (ఎం.కె.బి.) డివిజినల్ కమిటీకి ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్ – సిరిపూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. చర్ల – శబరి ఏరి యా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత, శారదక్క నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహ¯Œ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ ప్రచారం చేసింది. అమర వీరుల సంస్మరణ వారోత్సవాలకు ఏర్పాట్లు చేయగా, ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా తిరియా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌తో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ. -
పోలీస్ కం బ్యాక్
ఖమ్మం క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లో పనిచేస్తున్న 246 మంది పోలీసులు వెనక్కు రానున్నారు. అతి త్వరలో వారికి ఉత్తర్వులు అందనున్నాయి. ఆంధ్రలో విలీనమయ్యే భద్రాచలం (పట్టణం మినహా), కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, మోతుగూడెం, వీఆర్‌పురం ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ మండలాలు రాష్ట్రానికి సరిహద్దులో ఉండటం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడూ మావోయిస్టులు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని మావోయిస్టులు కూడా ఈ ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. విలీనమయ్యే ప్రాంతాల్లో రెండు సర్కిల్లు భద్రాచలం, చింతూరులో ఉన్నాయి. వీటిలో ఇద్దరు సీఐలు, 11మంది ఎస్ఐలు, 18 మంది ఏఎస్సైలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 183 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉత్తర్వులు అందగానే జిల్లా ఎస్పీకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆంధ్ర పోలీసులకు సవాలే... విలీనమైన ఏడు మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొన్ని ఏళ్లుగా విస్తృతంగా కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టడం కోసం జిల్లాకు చెందిన స్పెషల్‌పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ దళాలు, ఆయా మండలాల స్టేషన్ల సిబ్బంది విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవి ఉండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసులకు అడవిపై పూర్తి అవగాహన ఉంది. వారికి మావోయిస్టులు ఎక్కడ తలదాచుకుంటారో.. ఎక్కడ మందుపాతరలు అమర్చి ఉంటారో పసి కట్టే నైపుణ్యం ఉంది. మావోయిస్టు కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉన్నవారినే ఈ ఏడు మండలాల్లో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిగా నియమిస్తుంటారు. దీనికితోడు ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి మావోయిస్టులు కార్యకలాపాలపై పూర్తి నిఘా ఉంటుంది. ఈ మండలాలు ఆంధ్రలో విలీనం కావడంతో అతిత్వరలో బాధ్యతలు చేపట్టే ఆంధ్ర పోలీసులకు మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వారికి ఈ ఏజెన్సీ ప్రాంతాలపై అవగాహన లేదు. మండలాలు విలీనమయ్యే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నప్పటికీ మావోయిస్టు కార్యకలాపాల ప్రభావం ఎక్కువగా ఉండదు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మావోయిస్టుల కార్యకలాపాలపై ఆంధ్రా పోలీసులకు అంతగా అవగాహన లేదు. విలీనమయ్యే ఏడుమండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. జిల్లా పోలీసుల సహకారం తప్పనిసరి... ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అవి పెరగకుండా ఉండాలంటే ఆంధ్రా పోలీసులు జిల్లా పోలీసుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. జిల్లా పోలీసులతోపాటు ఈ ఏడు మండలాల్లో గతంలో పనిచేసిన యాంటీ నక్సల్స్ స్క్వాడ్‌తోపాటు స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ దళాల వద్దనుంచి సమాచారం సేకరించి మావోయిస్టుల కదలికలపై ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. వెనక్కు వచ్చే పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాలు విలీనం అవుతుండటంతో ఆయా మండలాల్లో పనిచేస్తున్న పోలీసులను వెనక్కు పిలిపిస్తున్నారు. భద్రాచలం రూరల్‌లో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, చింతూరులో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, కుక్కునూరు నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్, వేలేరుపాడు నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, 21మంది కానిస్టేబుల్స్, కూనవరం నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్, మోతుగూడెం నుంచి ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, వీఆర్‌పురం నుంచి ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్ వెనుక్కు రానున్నారు.