చెల్పాకలో 12 మంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
ఏడుగురు మరణించగా, పరారైన వారి కోసం గాలింపు
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. ఫ్రీజర్లలో భద్రం
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళ సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పరారైన మిగతా ఐదుగురి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాజేడు, వెంకటాపురం(కె)తో పాటు ఇటు మహారాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం, మంథని మహాదేవ్‌పూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు గాలిస్తున్నా యి. తప్పించుకున్న మావోయిస్టులకు గాయాలై ఉంటాయని, సమీప అటవీ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారని భావిస్తున్న పోలీసులు సోమవారం చెల్పాక అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక వైపు పొలకమ్మ వాగు, మరోవైపు దట్టమైన అటవీప్రాంతం ఉండటంతో పోలీసులు నలుమూలలా నిఘా వేసినట్లు తెలుస్తోంది.
సామాజిక ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు
ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక సామాజిక ఆస్పత్రిలో సోమవారం పోççమార్టం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చోటు చేసుకోగా, ఎస్పీ శబరీష్ మృతదేహాలను పరిశీలించిన తర్వాత భారీ బందోబస్తు మధ్య ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించాలని భావించారు. కానీ వర్షం, భద్రత కారణాల దృష్ట్యా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్ర పర్చారు.
సోమవా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం ప్రత్యేక పర్యవే క్షణ అధికారి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో కాకతీయ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌కు మార్, డీఎస్పీ రవీందర్‌రెడ్డితో చర్చించిన తర్వాత.. కాకతీ య వైద్య కళాశాల ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, ప్రొఫెసర్ ఖాజామొహినొద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ వైద్యులు నవీన్, మాధురి, మౌనిక, జీతేందర్, ప్రియాంక, ఫరేక, లావణ్య, తరుణ్, ప్రశాంత్‌లతో కూడిన బృందం ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది.
మధ్యాహ్నం 12.47 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 6.33 వరకు కొనసాగింది. అనంతరం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మావోయిస్టుల మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపర్చారు. వైద్యులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోస్టుమార్టం గది వద్ద ఉండేందుకు కూడా వీల్లేకుండా కట్టుదిట్టం చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి ఆస్పత్రి వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనదారులను అడ్డగించి ఆరా తీశారు.
విషం పెట్టారు.. హింసించి చంపారు
శరీరం మొత్తం తుక్కు తుక్కు చేశారు
మావోయిస్టు మల్లయ్య భార్య మీనా ఆరోపణ
ఏటూరునాగారం: ‘ఇది ఎన్‌కౌంటర్ కాదు.. అన్నంలో విషం పెట్టి బేహోష్ (అపస్మారకస్థితిలో)లో ఉన్నప్పుడు నా భర్తను పట్టుకున్న పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారు..’ అని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా ఆరోపించారు. ములుగు ఎన్‌కౌంటర్‌లో మరణించిన తన భర్త మృతదేహాన్ని చూడటానికి మీనా, సోదరుడు రాజయ్య ఆస్పత్రికి వచ్చారు.
ఈ సందర్భంగా మీనా విలేకరులతో మాట్లాడారు. ‘ముఖంపై చర్మం తప్ప శరీరంలో ఎక్కడా బొక్కలు కనబడటం లేదు.. మొత్తం తుక్కుతుక్కు చేసి హింసించి హింసించి చంపారు. తల నుజ్జునుజ్జుగా అయింది. దగ్గరినుంచే కాల్చి చంపినట్లు తెలుస్తోంది. హింసించి విషమిచ్చి చంపారా? లేక మత్తుమందు ఇచ్చి అతిక్రూరంగా చంపారా? అనేది అర్థం కావటం లేదు.
మరణించిన మహిళా మావోయిస్టును చూస్తే.. మొత్తం బట్టలు చింపేసి గొంతు కోసినట్లుగా ఉంది.. ఒక భుజం మొత్తానికే వెనక్కి తిరిగి ఉంది. ఎంత క్రూరంగా హింసించి చంపారో దీన్నిబట్టి అర్థమవుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి సీతక్క గతంలో నక్సల్స్ పార్టీలో పని చేశారు కదా.. ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లకు ఎలా మద్దతు తెలుపుతున్నారని మీనా ప్రశ్నించారు.
కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదంటేనే ఎంత క్రూరంగా హింసించి చంపారో తెలుస్తోందంటూ విలపించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గొప్పోడి అంజమ్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment