వీర జవాన్లే శ్రీరామ రక్ష: రాజ్‌నాథ్
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రేమించి, అభిమానించే వీర జవాన్ల ముందు ఏ ఉగ్రవాదం, తీవ్రవాదం ఏం చేయలేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. వీర జవాన్ల ధైర్యసాహసాలే భారత మాతకు శ్రీరామ రక్షన్నారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రాంగణాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతో కలసి శుక్రవారం ఆయన సందర్శించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ధైర్యసాహసాలకు మారుపేరు గ్రేహౌండ్స్ బలగాలన్నారు. మావోయిస్టులు, దేశ విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశ సమైక్యతా సమగ్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం... పోలీసులకు కావాల్సిన సౌకర్యాలను, అధికారాలను, స్వేచ్ఛను ఇచ్చిందని నాయిని వివరించారు.
1989లో నాటి డీఐజీ కె.ఎస్.వ్యాస్ స్థాపించిన గ్రేహౌండ్స్... ఈ రోజు దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థగా ఏర్పడిందని అనురాగ్‌శర్మ అన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఇక్కడి గ్రేహౌండ్స్‌లో శిక్షణకు వస్తుంటారని, రాష్ట్రంలో కొత్తగా రిక్రూట్ అయిన ప్రతి పోలీస్ ఆఫీసర్ తప్పనిసరిగా గ్రేహౌండ్స్‌లో కొంత కాలం పనిచేయాల్సిందేనన్నారు. జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.