మాకొద్దీ పనులు..!
మూడు గ్రిడ్ల సర్వే పనులకు ముందుకురాని ఏజెన్సీలు
అర్హత లేని మూడు కంపెనీలను తిరస్కరించిన అధికారులు
ఆదిలోనే అవాంతరాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాకు నాలుగు వాటర్‌గ్రిడ్‌లు మంజూరు కాగా, మూ డు గ్రిడ్ల పనులకు ప్రారం భంలోనే ఇబ్బందులొస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల గ్రిడ్ల పనులను సర్వే చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రావడం లేదు. వచ్చిన ఒకట్రెండు కంపెనీలకు అర్హత లేకపోవడంతో.. వాటిని జిల్లా ఆర్డ బ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తిరస్కరించారు.
దీంతో కేవలం ఒక్క కడెం గ్రిడ్ పనుల సర్వే మాత్రమే జరుగుతోంది. ఈ నాలుగు గ్రిడ్ల పనుల సర్వే కోసం ఆ శాఖ ఈఎన్సీ కార్యాలయం గత నెలలో టెండర్లు పిలిచిన విషయం విధితమే. ప్రభుత్వం ఆదిలాబాద్ గ్రిడ్ సర్వే కోసం రూ.74 లక్షలు, మంచిర్యాల గ్రిడ్ సర్వే కోసం రూ.36 లక్షలు, ఆసిఫాబాద్ గ్రిడ్ కోసం రూ.1.12 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించింది. కేవలం మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు సరైన ధ్రువపత్రాలు దాఖలు చేయలేదని ఈ మూడు కంపెనీలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల తిరస్కరించారు.
మరో వారం రోజుల్లో రెండోసారి టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర సర్కారు వినూత్నంగా ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.38 వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా జిల్లాకు రూ.4,390 కోట్లు కేటాయించింది. ఒక్కో వ్యక్తికి పల్లెల్లో వంద లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్ల చొప్పున తాగునీటి వసతి కల్పించేందుదకు నాలుగు గ్రిడ్లను మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాల్లో నిమగ్నమైంది.
కొలిక్కి వస్తున్న కడెం గ్రిడ్ సర్వే..
జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు తాగునీటి వసతి కల్పించేందుకు చేపట్టిన కడెం గ్రిడ్ సర్వే పనులు కొలిక్కి వస్తున్నాయి. ఐదు మండలాల పరిధిలో మొ త్తం 594 నివాసిత ప్రాంతాల (హ్యాబిటేషన్ల)లో ఉన్న 2.78 లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ పనులు చేపట్టనున్నారు. 96 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ గ్రిడ్‌కు రూ. 533 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయని ప్రాథమికంగా ని ర్ధారణకు వచ్చారు.
కడెం ప్రాజెక్టు నుంచి తాగు నీటిని సరఫరా చేయనున్నారు. జన్నారం, కడెం మండలాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన సర్వేను సిద్దూ సర్వీసెస్ కంపెనీ చేపట్టగా, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పనుల సర్వేను ఎస్ఎస్ఎస్ అసోసియేట్‌కు అప్పగించారు. పక్షం రోజుల్లో ఈ కంపెనీలు నివేదికలు ఇచ్చే అవకాశాలున్నాయి.
అంచనాలు రూపొందిస్తున్నాం
- ఇంద్రసేన, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ
కడెం గ్రిడ్ సర్వే పనులు పూర్తి కావస్తున్నాయి. పక్షం రోజుల్లో ఈ సర్వే నివేదిక వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనుల అంచనాలను రూపొందిస్తున్నాము. ఇందుకోసం కొందరు ఈఈలకు బాధ్యతలు అప్పగించాము. ఫిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.