పునరావృతం కానివ్వం!
శ్రీనివాస్ సంస్మరణ సభలో కన్సాస్ ఉన్నతాధికారులు
♦ కన్సాస్ సిటీలో భారత అమెరికన్ల శాంతి ర్యాలీ
♦ విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వబోమని ప్రకటన
♦ కూచిభొట్లతో అనుబంధాన్ని నెమరువేసుకున్న మిత్రులు
హూస్టన్ : విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్ సిటీలో వందల మంది క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు.
ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్లాండ్, పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్ మేయర్ కోప్లాండ్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్ చీఫ్ మెంకే వెల్లడించారు.
అనురాగం, ఆప్యాయతల కలబోత
కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ ఉద్వేగంగా సాగింది. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్ కన్నీటి పర్యంతమయ్యారు.
‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్ కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయనున్నారు.
ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే!
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్ గ్రిలాట్ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.