కేశోరాం ప్రభావిత గ్రామాల్లో సర్వే
బావులను పరిశీలించిన అధికారి
గ్రామస్తుల అభిప్రాయాల సేకరణ
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం ప్రభావిత గ్రామాల్లో జిల్లా జియాలజిస్టు ( భూగర్భ జల సంరక్షణ అధికారి) మంగళవారం పర్యటించారు. కేశోరాం కంపెనీ మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీ మైన్స్ మూలంగా సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా కర్మాగారం నుండి వెలువడే కాలుష్యం మూలంగా రోగాల బారిన పడటమే కాకుండా పంట దిగుబడులు తగ్గుతున్నాయని ప్రభావిత గ్రామాల ప్రజలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ నీతూప్రసాద్‌కు పిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై సర్వే నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు జియాలజిస్టు మోహన్ బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కన్నాల, రామారావుపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు ఎండిన చేదబావులను అధికారికి చూపించారు. కంపెనీ మూలంగానే బావుల్లో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయని వివరించారు. వ్యవసాయ, చేద బావులను పరిశీలించి స్థానికులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మోహన్ తెలిపారు. ఆయన వెంట రామారావుపల్లి సర్పంచ్ శేర్ల లక్ష్మీపతి, నాయకులు పూసాల మోహనాచారి, సూర సమ్మయ్య, దయానందం, పొన్నం రామలింగం, ఓడ్నాల శ్రీనివాస్, బుర్రగడ్డ రవికుమార్ ఉన్నారు.