grounded
-
విమానాల రద్దు సెగ: చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థల నిర్ణయంతో విమాన టికెట్ చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్ ఇండిగో, గో ఎయిర్ తమ సర్వీసులను రద్దు చేయడంతో కొన్ని కీలక మార్గాల్లో చార్జీల మోత మోగుతోంది. ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్ చేసుకోవడం, తిరిగి టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రధానమైన రూట్లలో 10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దేశీయ పెద్ద విమానయాన సంస్థలు ఇండిగో దాదాపు 65 విమానాలను, గో ఎయిర్ 11 విమానాలను రద్దు చేయడంతో లాస్ట్ మినిట్ ప్రయాణీకులకు భారీ షాక్ తగిలింది. విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ప్రతినిధి శరత్ దలాల్ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య వన్‌వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనావేశారు. దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందన్నారు. టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్ చేసుకున్న టికెట్ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రూట్లో కూడా బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలుకుతుండటం గమనార్హం. ఇండిగో అధికారిక వెబ్సైట్ అందించిన సమాచారం ఇండిగో బుధవారం 42 విమానాలను రద్దు చేసింది. ముంబయి, కోల్‌కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్ రూట్లు ఇందులో ఉన్నాయి. అయితే గో ఎయిర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాన్సిలేషన్ చార్జీలు రద్దు, రీషెడ్యూలింగ్ లాంటి చర్యలు చేపట్టుతున్నటు నిన్న ప్రకటించాయి. కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రాట్ అండ్ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్ మొరాయించిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
పరీక్షలు రాస్తే విమానాలు ఆగాల్సిందే
సియోల్: పరీక్షలు ప్రారంభమైతే ఎక్కడైనా మార్కెట్లు మూతబడటం చూశారా..! విమాన సర్వీసులు నిలిచిపోవడం విన్నారా..! అంతెందుకు దాదాపు శబ్ద కాలుష్యాన్ని కలిగించే చర్యలేవి చేయకుండా స్తబ్దంగా ఉండిపోవడం గమనించారా..! కానీ, ఇదంతా నిజమే. దక్షిణ కొరియాలో తమ దేశ పిల్లలు పబ్లిక్ పరీక్షలు రాసే గడువు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరీక్షలు మాములు పరీక్షలు కావు వారి తలరాతను మార్చేవి. వీటి తర్వాత వారు నేరుగా ఉద్యోగాలకే వెళతారంట. అందుకే వారికి ఏ మాత్రం డిస్టబెన్స్ లేకుండా ఈ పరీక్షలు నిర్వహించడం షరా మాములుగా వస్తుంది. ప్రస్తుతం ఆరు లక్షల మంది కొరియా విద్యార్థులు తమ ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షకు హాజరవుతున్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో గణితం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇతర భాషా సంబంధమైన పేపర్లు కూడా ఉంటాయి. అయితే, కెరీర్ నిర్ణయించేది మాత్రం గణితం, సైన్స్ పేపర్లట. అందుకే పరీక్ష రాసే వారేమోగానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికే వారి దగ్గరున్న ఆలయాలకు చేరుకుని ఎన్ని రకాల పూజలు ఉంటాయో అన్ని పూర్తి చేసి వారిని పరీక్షకు సిద్ధం చేశారు. ఈ పరీక్షలు రాసే సమయంలో ఆంగ్ల భాషకు సంబంధించి 25 నిమిషాలపాటు విని రాసే పరీక్ష ఉంటుంది. దీనికి ఎక్కడ భంగం కలుగుతుందో అని ఏకంగా విమానాల చప్పుడు కూడా రాకుండా వాటిని ఎక్కడికక్కడా ఆపేశారంట. బస్సులను, ఇతర మోటారు వాహనాలు ఆపేశారట. మరోపక్క, పరీక్షకు విద్యార్థులు ఆలస్యం కాకుండా చూసుకునేందుకు పోలీసులే ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, రోడ్లపై ఎలాంటి ట్రాఫిక్ ఉండకుండా మార్కెట్లు, చిన్న అంగడ్లు విద్యార్థులు పరీక్షకు హాజరైన తర్వాత తెరిచారు. -
భారీ తుఫాను.. 400 విమానాలు రద్దు!
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోను భారీ టైపూన్(తుఫాను) 'మిండుల్లే' వణికిస్తోంది. భారీ ఈదురుగాలులతో తుఫాను సోమవారం టోక్యోను తాకుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టోక్యో నుంచి ఉత్తర తొహుకు ప్రాంతం దిశగా మిండుల్లే ప్రభావం చూపుతుందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను సందర్భంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. టోక్యో నగరంపై మిండుల్లే తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇక్కడ వరదలు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అధికారులు సుమారు 400 విమానాలను రద్దు చేశారు. ముఖ్యంగా టోక్యోలోని హనెడ విమానాశ్రయంకు రాకపోకలు నిలిచిపోయాయి. 145 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు జపాన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ సైతం 90 విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో.. సుమారు 48 వేల మంది విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వెల్లడించారు.