పరీక్షలు రాస్తే విమానాలు ఆగాల్సిందే
సియోల్: పరీక్షలు ప్రారంభమైతే ఎక్కడైనా మార్కెట్లు మూతబడటం చూశారా..! విమాన సర్వీసులు నిలిచిపోవడం విన్నారా..! అంతెందుకు దాదాపు శబ్ద కాలుష్యాన్ని కలిగించే చర్యలేవి చేయకుండా స్తబ్దంగా ఉండిపోవడం గమనించారా..! కానీ, ఇదంతా నిజమే. దక్షిణ కొరియాలో తమ దేశ పిల్లలు పబ్లిక్ పరీక్షలు రాసే గడువు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరీక్షలు మాములు పరీక్షలు కావు వారి తలరాతను మార్చేవి. వీటి తర్వాత వారు నేరుగా ఉద్యోగాలకే వెళతారంట.
అందుకే వారికి ఏ మాత్రం డిస్టబెన్స్ లేకుండా ఈ పరీక్షలు నిర్వహించడం షరా మాములుగా వస్తుంది. ప్రస్తుతం ఆరు లక్షల మంది కొరియా విద్యార్థులు తమ ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షకు హాజరవుతున్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో గణితం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇతర భాషా సంబంధమైన పేపర్లు కూడా ఉంటాయి. అయితే, కెరీర్ నిర్ణయించేది మాత్రం గణితం, సైన్స్ పేపర్లట. అందుకే పరీక్ష రాసే వారేమోగానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికే వారి దగ్గరున్న ఆలయాలకు చేరుకుని ఎన్ని రకాల పూజలు ఉంటాయో అన్ని పూర్తి చేసి వారిని పరీక్షకు సిద్ధం చేశారు.
ఈ పరీక్షలు రాసే సమయంలో ఆంగ్ల భాషకు సంబంధించి 25 నిమిషాలపాటు విని రాసే పరీక్ష ఉంటుంది. దీనికి ఎక్కడ భంగం కలుగుతుందో అని ఏకంగా విమానాల చప్పుడు కూడా రాకుండా వాటిని ఎక్కడికక్కడా ఆపేశారంట. బస్సులను, ఇతర మోటారు వాహనాలు ఆపేశారట. మరోపక్క, పరీక్షకు విద్యార్థులు ఆలస్యం కాకుండా చూసుకునేందుకు పోలీసులే ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, రోడ్లపై ఎలాంటి ట్రాఫిక్ ఉండకుండా మార్కెట్లు, చిన్న అంగడ్లు విద్యార్థులు పరీక్షకు హాజరైన తర్వాత తెరిచారు.