అసాధ్యమనేదేదీ లేదు!
నిర్ధేశించుకునే లక్ష్యం గొప్పదిగా ఉండాలి
కష్టపడితే విజయం సొంతం
జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్
గ్రూప్ పరీక్షలపై అవగాహన సదస్సుకు విశేష స్పందన
అనంతపురం అర్బన్: గ్రూప్ పరీక్షలపై సాక్షి’ యువమైత్రి, విన్‌విన్ అకాడమీ సంయుక్తంగా జిల్లా కేంద్రం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకి విశేష స్పందన లభించింది. సదస్సులో నిపుణులైన ఆకాడమీ డైరెక్టర్లు చేసిన సూచనలు, సందేహాల నివృత్తి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయంటూ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూప్ పరీక్షలకు ఎలా సన్నద్ధం అయితే విజయం సొంతమవుతోందనే విషయం తెలుసుకున్నామన్నారు. అవగాహన సదస్సు మార్గనిర్ధేశకంగా ఉందన్నారు. సదస్సుకి జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాక్షి బ్రాంచ్ మేనేజర్ కేధార్నాథ్రెడ్డి అధ్యక్షత వహించారు.
విద్యార్థులనుద్ధేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ‘నిర్ధేశించుకునే లక్ష్యం గొప్పదిగా ఉండాలి. అసాధ్యం అనే ఆలోచన పొరబాటున కూడా మదిలోకి రానివ్వకూడదు. కష్టపడితే విజయం సొంతమవుతుంది’ అన్నారు. సాధారణ పరీక్షలు, పోటీ పరీక్షలు భిన్నమైనవన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించే దిశగా ప్రయత్నం చేస్తే విజయం వెన్నంటి వస్తుందన్నారు. ఓటమితో కుంగిపోకుండా.. పాఠాలు నేర్చుకోవాలని, తప్పులు సరిదిద్దుకుని నూతనోత్తేజంతో ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చాలా కీలకమని సూచించారు. నిపుణుల మార్గదర్శకంలో వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రణాళికబాద్ధంగా గమ్యం వైపు అడుగులేస్తే నిర్ధేశించుకున్న లక్ష్యం సొంతమవుతుందన్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభకే అవకాశాలు లభిస్తాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతిభను పెంచుకుంటూ విజయం సాధించాలని సూచించారు.
గ్రూప్ పరీక్షలకు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటికి ఏ విధంగా సమాధానం రాయాలి అనే విషయాలను అకాడమీ డైరెక్టర్ వివరించారు. సెన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జనరల్ ఎస్సేస్ అంశాలపై డైరెక్టర్ సి.హరికృష్ణ అవగాహన కల్పించారు. భారత, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర అంశాలపై డైరెక్టర్ కె.యాకుబ్‌బాషా వివరించారు. ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థిక అంశాలపై డైరెక్టర్ అల్లాడి అంజయ్య అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
మార్గదర్శకంగా ఉంది
గ్రూప్ పరీక్షలకు ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు నాకు సరైన అవగాహన లేదు. సాక్షి నిర్వహించిన అవగాహన సదస్సు మార్గదర్శకంగానూ, దిశానిర్ధేశంగా ఉంది. నిపుణులు ఇచ్చిన సూచనలు అమూల్యమైనవి. సదస్సుకి హాజరు కావడంతో నాలో ఆత్మస్థైర్యం పెరిగింది.
– శ్రావణ్‌కుమార్, డిగ్రీ విద్యార్థి
ఉపయోగకరంగా ఉంది
గ్రూప్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి అనేదానిపై నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరమైనవి. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం ఎలా రాయాలి అనేదానిపై పూర్తి క్లారిటీ వచ్చింది.
– నగేశ్, పీహెచ్డీ స్కాలర్, ఎస్కేయూ, అనంతపురం
సంతృప్తిగా ఉంది
గ్రూప్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనేది అవగాహన సదస్సు ద్వారా తెలుసుకున్నాను. పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలి అనేవాటిపై నిపుణులు సబ్జెక్టుల వారీగా చేసిన సూచనలు విలువైనవి. సదస్సు సంతృప్తినిచ్చింది.
– స్వర్ణలత, పీజీ విద్యార్థిని