జాబ్స్ అంటూ లక్షలు దోచేస్తారు.. జాగ్రత్త!
హైదరాబాద్: ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కన్సల్టెన్సీ ఏర్పాటుచేసి ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశచూపి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయాలు గుంజుతున్న ఢిల్లీ ముఠా బాగోతం హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సైబర్ విభాగం ఏసీపీ ఎస్.జయరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ కౌరవ్, అర్జున్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిగా చెలామణి అవుతూ అవుతూ జాబ్స్ వెబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డాటా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి 'యాస్ గ్రూప్ కన్సల్టెన్సీ' నుంచి కాల్ చేస్తామని చెప్పి అతడికి మెయిల్ చేశారు. నెంబర్ తీసుకున్న ముఠా శ్రవణ్‌కు ఫోన్ చేసి మొదట సెక్యూరిటీ కింద రూ.12,150 కట్టాలని చెబితే పే చేశాడు.
ఆ తర్వాత ఇండిగో ఎయిర్‌లైన్స్ హెచ్ఆర్ అంటూ చెప్పి డిమాండ్ చేయగా మరో రెండు దఫాలుగా మొత్తం రూ. 1.84 లక్షలు వారు చెప్పిన అకౌంట్లో జమచేశాడు. జాబ్ గురించి ఫోన్ చేస్తే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఈ జనవరి 3న జీడిమెట్ల సూరారం కాలనీకి చెందిన శ్రవణ్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి ఫేక్ కన్సల్టెన్సీ అని తేల్చేశారు. మరో నలుగురి సాయంతో రాహుల్, అర్జున్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని గుర్తించారు.
నిందితులను అరెస్ట్ చేసి కుకట్పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ఈ కేసు విచారణ చేస్తున్నారని, జాబ్స్ అనగానే డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఓ ప్రకటనలో సైబర్ క్రైమ్ విభాగం సూచించింది. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.