‘లే -అవుట్ల’ నిరోధక ఆదేశాలపై స్టే
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారయ్యేంతవరకు విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లే-అవుట్ల, గ్రూప్ డెవలప్మెంట్ తదితరాలకు అనుమతులు ఇవ్వొదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఇంకా తయారుకాని మాస్టర్ ప్లాన్ను కారణంగా చూపి ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఏపీ సర్కార్ ఆదేశాల అమలును నిలుపుదల చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రాసిన లేఖ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లేఖ విషయంలో ప్రభుత్వం చట్ట పరిధిని దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.
విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎంయూడీఏ) పరిధిలో ఎటువంటి లేఔట్లు, గ్రూప్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని వీజీటీఎంయూడీఏ వైస్ చైర్మన్, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది సెప్టెంబర్ 17న లేఖ రాశారు.
దీనిని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కుమారుడు శ్రీ చైతన్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు విచారించారు.వాదనలు విన్న న్యాయమూర్తి పై విధంగా ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు.