రాస్కెల్.. యూజ్లెస్ ఫెలో
ఏకేటీపీ ఉపాధ్యాయులపై కమిషనర్ దూకుడు
ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు
సామూహిక సెలవుకు రంగం సిద్ధం
విజయవాడ సెంట్రల్ : యూజ్లెస్ ఫెలో, రాస్కెల్.. ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నావ్. వీడు కాలేజీలో ఉండగా చదివి ఉండడు. చదివితే పిల్లలకు చెప్పేవాడు. నువ్వు నేటివ్ తెలుగేనా? నార్త్ ఇండియానా? నీకు తెలుగు వచ్చా. 155 మందికి 12 మంది తప్పారు. సిగ్గుపడాలి. ఈవిడ యూజ్లెస్ ఫెలో. సస్పెండ్ చేయండి. మానిటరింగ్ చేయడమే రాదు. వీళ్లను నమ్ముకుంటే మీరు పాస్ కారు. మీ అంతట మీరే చదువుకోవాలి. ..అంటూ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ ఏకేటీపీ స్కూల్ ఉపాధ్యాయుల్ని అవమానపరిచారంటూ నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి సర్కిల్ 2 కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం ప్రతి నిధులు డిమాండ్ చేశారు. గురువారం నుంచి సామూహిక సెలవు పెట్టడం ద్వారా ఆందోళనను ఉధృతం చేయాలనే యోచనలో ఉన్నారు.
ఏం జరిగిందంటే..
నగరపాలక సంస్థ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పర్యవేక్షించేందుకుగాను బుధవారం కమిషనర్ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం హెచ్ఎం రూంలో ఉపాధ్యాయులతో సమావేశం జరిపారు. త్రైమాసిక పరీక్షల్లో 30 మంది విద్యార్థులు ఫెయిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూరుశాతం ఫలి తాలు లక్ష్యంగా ఎందుకు పనిచేయడం లేదని నిలదీ శారు. సరైన పద్ధతిలో బోధన చేయలేనివారు సర్వీసు వదిలి వెళ్లిపోవాల్సిందిగా క్లాస్ తీశారు. పర్యవేక్షణ లోపించిన కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కె.నీలిమాదేవి, పీఎస్ ఉపాధ్యాయుడు కె.ఇ. పాల్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా డీవైఈవో దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు. హెచ్ఎం రూంలో కమిషనర్ అనుచిత వ్యాఖ్యలతో తమను అవమానించారన్నది ఉపాధ్యాయుల ఆరోపణ.
కొనసాగుతున్న ఆందోళన
కమిషర్ వచ్చి క్షమాపణ చెప్పే వరకు ధర్నాను విరమించేది లేదని ఉపాధ్యాయులు పట్టబట్టారు. సర్కిల్-2 కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయిం చారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, ఫ్లోర్ లీడర్ బండినాగేంద్ర పుణ్యశీల, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సంఘీభావం తెలి పారు. ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పెరగడంతో కమిషనర్ కంగుతిన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి చర్చలకు రావాలని డీవైఈవోకు ఫోన్ చేశారు. ఈ ప్రతిపాదనను ఉపాధ్యాయవర్గాలు తిరస్కరించాయి. తమ వద్దకు వచ్చి క్షమాపణ కోరితేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. మహిళా ఉపాధ్యాయులు సౌలభ్యం కోసం రాత్రి పది గంట లకు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గురువారం ఉదయం 8 గంటలకు తిరిగి ఆందోళన చేపడతామని ఉపాధ్యాయులు ప్రకటించారు. వారికి మద్దతుగా పదిమంది ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
దురదృష్టకరం
ఉపాధ్యాయులపై కమిషనర్ వీరపాండియన్ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాలే కానీ, నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు కమిషనర్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు.