ఆగస్టు 17 నుంచి గ్రూప్1 మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్1–2016 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం ఆరు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 17న జనరల్ ఇంగ్లిష్, 19న పేపర్–1, 21న పేపర్–2, 23న పేపర్ 3, 26న పేపర్ 4, 28న పేపర్–5 పరీక్షలుంటాయి.
జూనియర్ లెక్చరర్ల (ఎకనమిక్స్) సవరణ జాబితా విడుదల
ఇలా ఉండగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎకనమిక్స్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2011లో పరీక్షలు నిర్వహించి ఇంటర్వూ్యలు కూడా పూర్తిచేసిన నోటిఫికేషన్లో న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి సవరణ జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. మొదటి ఎంపికకు సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు 96 మందికి మే 1 నుంచి ఇంటర్వూ్యలు నిర్వహించి 95 మందితో తాజా జాబితాను విడుదల చేశారు.
19నుంచి డిçప్యూటీ సర్వేయర్లు, డ్రాఫ్ట్స్మెన్ల సర్టిఫికెట్ల పరిశీలన
అసిస్టెంటు అర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 19వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 21వరకు మొత్తం 297 మంది ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తేదీల వారీగా ఉదయం మధ్యాహ్నం వేళల వారీగా పరిశీలనకు రావలసిన ఆయా అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది.