జీఎస్టీ ఆమోదంపై సర్కారు ధీమా
న్యూఢిల్లీ: ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. అక్టోబర్ 1 నుంచిజీఎస్టీని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న నేపథ్యంలో.. ఆ లోపు బిల్లు రాజ్యసభతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. జీఎస్టీ బిల్లు, దివాలా బిల్లు ఆమోదం పొందితే సంస్కరణల దిశగా మంచి ముందడుగు పడినట్లవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం అడ్వాన్సింగ్ ఏషియా సదస్సులో చెప్పారు. కాగా, తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగియడానికి మరో మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కొన్ని కీలక బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్లు, ఎనిమీ ప్రాపర్టీ బిల్లు మొదలైనవి అందులో ఉన్నాయి. స్థిరాస్తి బిల్లు రాజ్యసభలో, ఆధార్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై ఆనందంగా ఉన్న ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, రాజ్యసభలో ఆధార్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందేందుకు నడుం బిగించింది. మిగిలిన మూడు రోజుల్లో బడ్జెట్ అనుబంధ పద్దులపై చర్చ, ఓటింగ్‌తో పాటు సంబంధిత ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం జరగాల్సి ఉంది. అలాగే, 16వ తేదీన రియల్ ఎస్టేట్ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. మరోవైపు, వివాదాస్పద భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ నేడు(సోమవారం) మరోసారి భేటీ కానుంది.