‘గుడా’ చైర్మన్‌గా గన్ని కృష్ణ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, రాజమహేంద్రవరం :
కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల మున్సిపాలిటీలు, గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాళ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు గుడాకు తాత్కాలిక చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తాత్కాలిక వైస్ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషన్ వి.విజయరామరాజు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై గుడాకు పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్, పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంది. అలాగే గుడా ప్రధాన కార్యాలయాన్ని కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వైఎస్సార్సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. అదేవిధంగా షర్మిలారెడ్డి చొరవతో ఈ నెల 15న జరిగిన కౌన్సిల్ సమావేశం అజెండాలో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలనే అంశాన్ని చేర్చారు. కౌన్సిల్ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా మద్దతు లేఖలు ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరానికే చెందిన గన్ని కృష్ణ గుడా చైర్మన్‌గా ఎంపికవడంతో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.