గుడివాడ ‘తమ్ముళ్ల' తన్నులాట
మళ్లీ బయటపడ్డ విభేదాలు
గుడివాడ అర్బన్ : గుడివాడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోమారు బయటపడ్డాయి. సమావేశం జరుగుతుండగానే పిన్నమనేని వర్గానికి చెందిన ఇరువురు నాయకులు కుమ్ములాడుకున్నారు. పెద్ద పెద్ద అరుపులతో, బూతుపురాణాలతో ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్, నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు సమక్షంలోనే ఈ కుమ్ములాట జరగడంతో తోటి కార్యకర్తలు అవాక్కయ్యారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈసంఘటనతో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరోమారు రచ్చకెక్కినట్లయింది. టీడీపీ సభ్యత్వ నమోదుసందర్భంగా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్ హాజరయ్యారు. ఉదయం 11.30గంటలకు సమావేశం అనడంతో కార్యకర్తలంతా హాజరయ్యారు.
పూలమాలలు వేసే సమయంలో రగడ
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్ పార్టీ కార్యలయానికి చేరకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు స్వతంత్య అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన రహీమ్‌ఖాన్ ఆయనకు పూలదండ వేసేందుకు వెళ్లారు. ఇదే సమయంలో 12వ వార్డుకు పోటీ చేసిన షేక్ ఇబ్రహీం అడ్డుపడ్డారు. ‘నేను ఓడిపోవడానికి నువ్వు కృషి చేశావు.. నువ్వు ఏ అధికారంతో పూల దండ వేస్తావు’ అంటూ రహీమ్‌పై ఇబ్రహీం వాగ్వివాదానికి దిగారు. ఈలోగా మాటా మాట పెరగడంతో ఇబ్రహీం రహీమ్‌ను తోసేశారు. దీంతో ఆయన గోడపై పడ్డారు. నన్నే తోస్తావా అంటూ రహీమ్ , షేక్ ఇబ్రంహీంపై దాడికి దిగారు. ఇలా ఒకరిపై మరోకరు కలబడుకుంటూ బూతు పురాణాలుతో తిట్టుకున్నారు.
పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మైక్ తీసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం ఇబ్రహీం, రహీమ్‌లతో నాయకులు ఏకాంతంగా చర్చించారు. కాగా కొంతమంది పిన్నమనేని, రావి వర్గీయులు పాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. సమావేశం అయిన తరువాత బయటకు వచ్చిన నాయకులు కొంతమంది మళ్లీ వాగ్వివాదానికి దిగారు. గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షుడు బాపయ్యచౌదరి మండల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువురూ చొక్కాలు పట్టుకుని దూషించుకున్నారు.