గుడుంబా తయారీదారులకు పునరావాసం
♦ రాష్ట్రంలో 7,886 మంది గుర్తింపు
♦ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.157 కోట్లు
♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: గుడుంబా తయారీదారులకు పునరావాసం కల్పిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డిలో హరేకృష్ణ సొసైటీ, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,500 మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ, ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో గుడుంబా నిరోధక, పునరావాస పథకం కింద 165 మంది లబ్ధిదారులకు రూ.3.35 కోట్ల సాయం, కోహిర్ మండలం కవేలీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ప్రారంభించారు.
అనంతరం జహీరాబాద్‌లో ఎంసీహెచ్‌ను ప్రారంభించడంతో పాటు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుడుంబా తయారీపై ఆధారపడి జైలుపాలైన వారు ఆత్మగౌరవంతో బతికేందుకు తమ ప్రభుత్వం గుడుంబా నిరోధక పునరావాస పథకం ప్రవేశ పెట్టిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,886 మందిని గుర్తించామని, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.157 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
నకిలీ ఎరువులు, విత్తనాలు, గుడుంబా, పేకాట వంటి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మికులను వేధించకుండా.. ఈత వనాల పెంపకం ద్వారా కల్తీ కల్లును నిరోధించాలని సూచించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవిగా ప్రచారం చేసుకుం టున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు.
సీఎం పరిశీలనలో ఏకీకృత సర్వీస్ రూల్స్
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం దన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, బాబూమోహన్, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణి మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బూట్లు తొడిగిన మంత్రి
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో హరేకృష్ణ సొసైటీ, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు స్వయంగా బూట్లు తొడిగారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే చింతాప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ తదితరులు సైతం బూట్లు తొడిగారు.
– సంగారెడ్డి అర్బన్