విభేదాలే అదనుగా ఎర్ర స్మగ్లింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఒకరికొకరు కలిసిమెలసి పనిచేయాల్సిన ఆ రెండు శాఖలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వారి మధ్య విభేదాలు ఎర్రదొంగలకు వరంగా మారాయి. అందుకే జిల్లా నుంచి ఎర్రబంగారం యథేచ్ఛగా తరలిపోతోంది. అందుకు ఆత్మకూరు, గూడూరు అటవీ డివిజన్ పరిధిలో నరికివేతకు గురవుతున్న ఎర్రచందనం చెట్లే నిదర్శనం. అలా నరికి దాచిపెట్టిన దుంగలు యథేచ్ఛగా సరిహద్దులు దాటి వెళ్తున్నాయి.
అయినా జిల్లా అధికారులు అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు పోలీసులు, అటవీశాఖ మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పోలీసులు, అటవీ అధికారుల మధ్య చిచ్చురేగిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇరుశాఖల అధికారులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ప్రచారం ఉంది.
దీంతో ఎర్రదొంగలకు మార్గం సుగమమైంది. జిల్లాలోని ఉదయగిరి నుంచి వెంకటగిరి వరకు విస్తరించిన అటవీప్రాంతంలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పోలీసు, అటవీ అధికారులు ఎర్రదొంగల కట్టడికి చేపట్టిన చర్యలు ఫలించడంతో అక్కడ అక్రమరవాణా తగ్గుముఖం పట్టింది. దీంతో నెల్లూరు జిల్లాలో ఉన్న ఎర్రబంగారంపై ఎర్రదొంగల కన్నుపడింది.
సరిహద్దులు దాటుతున్న ఎర్రబంగారం
జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణాపై నిఘా తగ్గడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అక్రమార్కులకు ఎర్రచందనం రవాణా లాభసాటిగా మారడంతో జిల్లాకు చెందిన కొందరు స్మగ్లర్ల అవతారమెత్తారు. కొంతకాలంగా అటవీ ప్రాంతంలోని ఎర్రచందనాన్ని నరికి ఇతర ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. అదేవిధంగా ఉదయగిరి అడవుల్లో భారీగా ఎర్రచందనం దుంగలను నిల్వచేసినట్లు తెలిసింది.
భారీగా డంప్చేసిన దుంగలను చిన్నగా జిల్లా సరిహద్దులు దాటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు విజయవాడ, చెన్నై ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. అందుకు చిత్తూరు జిల్లాలో తరచూ పట్టుబడుతున్న ఎర్రదొంగలే నిదర్శనం. రెండు రోజుల క్రితం తిరుపతిలో పదిమంది స్మగ్లర్లు, భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని దొంగల్లో జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉండడం గమనార్హం.
ఈ ఐదుగురు ప్రధాన స్మగ్లర్లుగా అధికారులు చెబుతున్నారు. వీరి అనుచరులు ఇంకెంత మంది ఉన్నారనే దిశగా అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం మంగళవారం అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఇంటి దొంగలపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇటీవల పట్టుబడిన ఒక పోలీసు, ఇద్దరు అటవీ అధికారులను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.