ఆడ పిల్లగా పుట్టి మగాళ్లవుతున్నారు!
శాంటో డొమింగో: కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో పుట్టే బిడ్డల్లో జన్యు లోపం కారణంగా అక్కడి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. వారికి పుట్టిన ఆడ శిశువులు 12వ ఏట మగ పిల్లలుగా మారిపోతున్నారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంజైమ్ లోపం కారణంగా మగ బిడ్డగా పుట్టాల్సిన బిడ్డ ఆడ శిశువుగా పుడుతోందని, ఇలాంటి వాళ్లను ‘గెవెడాసెస్’ అని శాస్త్ర పరిభాషలో పిలుస్తారని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆడపిల్లగా పుట్టిన వారిలో ‘డీహైడ్రో టెస్టోస్టెరోన్’ హార్మోన్ కారణంగా వారు 12వ ఏట మగ పిల్లలుగా మారుతున్నారని వైద్యులు వివరించారు.
డొమెనిక్ రిపబ్లిక్లో ప్రతి 90 మందిలో ఒకరు ఇలా మారుతుండగా, సాలినాస్ పట్టణంలో ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ శిశువులుగా పుట్టి 12వ ఏట మగ పిల్లలుగా మారుతున్నారని, ఈ విషయం 1970వ దశకంలో మొదటిసారి వెలుగులోకి వచ్చిందని, ఇప్పటి వరకు అలాగే జరుగుతోందని డాక్టర్ మైఖేల్ మోస్లే తెలిపారు. డొమెనికన్లో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, లభించే ఆహారం కారణంగా ఇలా జరగుతోందని ఆయన చెప్పారు. జన్యుపరమైన ఈ కారణానికి ఇప్పటి వరకు రెమిడీ కనుక్కోలేక పోయామని ఆయన మీడియాకు తెలిపారు. తల్లుల్లో హార్మోన్ లోపాన్ని ముందుగానే గుర్తించి, వారికి ఆ హార్మోన్ను సకాలంలో ఎక్కించ గలిగితే ఫలితం ఉంటుందని, అయితే ఇంకా ఆ దిశగా ప్రయోగాలు జరగాల్సి ఉందని డాక్టర్ తెలిపారు.
పుట్టిన ఆడ శిశువు ఊహించని విధంగా మగపిల్లాడుగా మారినప్పుడు అడిపిల్లగా పెట్టిన పేరును మార్చడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు అదే పేరును కొనసాగిస్తుండగా, కొందరు పేర్లను మారుస్తున్నారు. ఇప్పుడిప్పుడు పేరు సులభంగా మార్చే విధంగానే తల్లిదండ్రులు ఆడ శిశువులకు పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు కార్లా అనే ఆడ పిల్ల పేరును కార్లోస్గా మారుస్తున్నారు. వారు ఇలాంటి తరుణోపాయాన్ని కనుగొనడం బాగానే ఉందిగానీ, తోటి పిల్లల మధ్య ఆడపిల్లగా పెరిగి హఠాత్తుగా మగ పిల్లాడిగా మారితే ఆ పిల్లలు అనుభవించే మానసిక క్షోభ ఎలా ఉంటుందో వైద్యులు అధ్యయనం చేయాల్సిందే.