బీజేపీకి టీడీపీతో పొత్తు ఉండదు
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీరాంనాయక్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక అటవీ శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాము ఒంటరి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని కొందరు టీడీపీ ప్రధాన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను మరో గుజరాత్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్‌ను కేంద్రప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రధాని మన్మోహన్సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతిలో, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్సీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ఆసిఫాబాద్‌లో అభివృద్ధి కానరావడం లేదని ఆరోపించారు. బీజేపీ కాంట్రాక్ట్ సెల్ జిల్లా కన్వీనర్ గుల్ఫం చక్రపాణి, జిల్లా కన్వీనర్ చెర్ల మురళి, నాయకులు ప్రకాశ్ జాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ వ్యతిరేక పార్టీలతో అంతే..
రెబ్బెన : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యహరించే ఏ పార్టీతో బీజేపీ పొత్తులు పెట్టుకోబోదని శ్రీరాంనాయక్ స్పష్టం చేశారు. ఆదివారం గోలేటిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మనుగడ కోసమే బీజేపీతో పొత్తు ఉంటుందని తప్పుడు సంకేతాలు ప్రజలకు అందిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో తాము పార్టీ తరఫునే పోటీ చేస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ జేబీ పౌడెల్, కాంట్రాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ చక్రపాణి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ శర్మ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు రాచకొండ రాజు పాల్గొన్నారు.