వివాహిత అనుమానాస్పద మృతి
బోథ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని గుల్జార్ మైలా (14వ వార్డు) కాలనీకి చెందిన శైలజ ఉరఫ్ అయోషా ఫాతిమా(22) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోథ్‌లోని గుల్జార్ మైలా కాలనీకి చెందిన మూగ యువకుడు తబ్రేశ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని బధిరుల పాఠశాలలో చదివేవాడు. అదే పాఠశాలలో చదివే ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన మూగ బాలిక శైలజతో ఏర్పడ్డ స్నేహం వారి మధ్య ప్రేమకు దారితీసింది. నిర్మల్ పోలీసుల సహకారంతో ఏడాదిన్నర క్రితం తబ్రేశ్, శైలజ పెళ్లి చేసుకున్నారు.
అనంతరం శైలజ అయేషా ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని శైలజ కుటుంబ స భ్యులు తమ కూతురిని తమకు అప్పగించాలని అప్పట్లో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరపాటు శైలజ, తబ్రేశ్ల కాపురం సజావుగా సాగింది. నెలన్నర క్రితం శైలజ పాపకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల క్రితమే ఆ పాపకు బారసాల నిర్వహించి ఉమ్మె హబీబాగా నామకరణం చేశారు. ఈ వేడుకలకు శైలజ తల్లి గంగమ్మ హాజరైంది. ఆమె శనివారం సైతం కూతురింటికి వెళ్లివచ్చింది. ఈ క్రమం లో ఆదివారం ఉదయం తబ్రేశ్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అత్త మలాన్ మనవరాలి బట్టలు ఉతుకుతోంది. స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన శైలజ ఎంతకూ తలుపులు తీయలేదు.
స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా దూలానికి శైలజ మృతదేహం వేలాడుతూ కనిపిం చింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. ఆమె మృతితో నెలన్నర వయసున్న చిన్నారి తల్లిప్రేమకు దూరమైంది. సీఐ మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధూరి చేరుకుని సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. కాగా, తన కూతురిని ఆమె అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శైలజ తల్లి గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపరేషన్ అరుున శైలజకు విశ్రాంతి అవసరమని, తనతో కూతురిని పంపాలని కోరినా ఆమె అత్తింటివారు పంపకుండా అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
గూడెంలో వృద్ధుడు..
దండేపల్లి : మండలంలోని గూడెం గ్రామానికి చెందిన దమ్మ నర్సయ్య(65) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై శ్రీని వాస్ కథనం ప్రకారం.. నర్సయ్య శనివారం ఎడ్లబండిపై చేను వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి బయల్దేరగా రాత్రి వరకు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లగా మార్గమధ్యంలో బండి చక్రం ఊడిపోయి కొంత దూరంలో తలకు గాయమై చనిపోరుున నర్సయ్య మృతదేహం కనిపించింది. ఆదివారం ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నర్సయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, నర్సయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.