విమర్శల చిత్రం విడుదలకు సిద్ధం
తమిళసినిమా: ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొని కలకలం పుట్టించిన హిందీ చిత్రం మెసెంజర్ ఆఫ్ గాడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ వ్యవహారంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌తో సహా 9మంది సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నటుడు గుమిత్ రామ్ రహీం సింగ్ హీరోగా నటించి సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని హకిత్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక హీరో గుమిత్ రామ్ రహీం సింగ్ బుధవారం మద్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
యువతను దృష్టిలో పెట్టుకుని మెసెంజర్ ఆఫ్ గాడ్‌ను రూపొందించిన కథా చిత్రం అని అన్నారు. చిత్ర వివాదాంశం గురించి మాట్లాడుతూ ఇందులో ఏ మతాన్నీ కించపరిచే విధంగా సన్నివేశాలను పొందుపరచలేదన్నారు. అయితే కొందరు ముంబయి సిటీ సివిల్ కోర్టులో చిత్రానికి వ్యతిరేకంగా పిటీషన్‌దాఖలు చేశారని తరువాత ఆ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ విచారణకు వెళ్లడంతో సంచలనం అయ్యిందన్నారు. సుప్రీం కోర్టు చిన్న చిన్న కట్స్‌తో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. చిత్రాన్ని అతి తక్కువ వ్యయంతో కేవలం 67 రోజుల్లోనే చిత్రీకరించినట్లు తెలిపారు. దీన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు గుమిత్రామ్ రహీం సింగ్ వెల్లడించారు.