బాలికపై వృద్ఢుడి అత్యాచారయత్నం
చెర్లోపల్లిలో కామాంధుడికి దేహశుద్ధి
నిందితుడిని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
పుత్తూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదు
పుత్తూరు : మద్యం మత్తులో ఉన్న వృద్ధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అమ్మమ్మ(అవ్వ) సాహసం చేసి మనుమరాలిని సురక్షితంగా కాపాడుకున్న సంఘటన శుక్రవారం పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు నిందిడుడికి దేహశుద్ధి చేసి పుత్తూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ రామాంజనేయలు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో నివాసం ఉంటున్న గుణ శేఖర్‌రెడ్డి(64) అనే వృద్ధుడు సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బాలిక(4)ను పిలిచి చాక్ లెట్ ఇస్తానని నమ్మబలికాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఆ బాలికను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. గమనించిన అంగన్వాడి ఆయా బాలిక ఇంటి వద్దకు వెళ్లి విచారించింది. విషయాన్ని బాలిక అమ్మమ్మకు చెప్పింది. సమాచారం అందుకున్న ఆమె గుణశేఖర్రెడ్డి ఇంటికి వెళ్లింది.
మూసివున్న ఇంటి తలుపు తెరవాలని కేకపెట్టింది. అయినా తెరవకపోవడంతో ఆమే తలుపు గడియను ఏదో రకంగా తీసేసింది. అప్పటికే ఆ బాలిక ఒంటిపై దుస్తులులేవు. అఘాయిత్యం చేయబోతున్న అతడి నుంచి మనుమరాలిని విడిపించుకుంది. ఈ దశలో ఆమెపై నిందితుడు దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు కేకలు పెట్టడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.