నా భర్త మరణానికి కారణమేమీ?
మూర్ఛతో మృతిచెందాడని మోసగించాడు
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పలమనేరు: తాపీ పనికని భర్తను బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా మూర్ఛవ్యాధితో మృతిచెందినట్లు నమ్మబలికి ఇప్పుడేమో రూ.3 లక్షలు పరిహారం ఇస్తానంటూ చెబుతున్న వ్యక్తిపై విచారణ జరిపి తన భర్త మృతికి కారణమేమిటో తెలుసుకోవాలని బాధితురాలు గుణవతి శుక్రవారం పలమనేరు సీఐ సురేంద్రరెడ్డికి ఫిర్యా దు చేసింది. బాధితురాలి కథనం మేరకు పలమనేరు పురపాలక సంఘపరిధిలోని నీళ్లకుంటకు చెందిన వెంకటేష్నాయుడు తాపీ పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య బెంగళూరులో ఎక్కువ సంపాదన వస్తుందని ఒప్పించి గత నెల 25న అక్కడికి తీసుకెళ్లాడు. డిసెంబర్ 31న అక్కడ తాపీ పనిచేస్తుండగా వెంకటేష్ నాయుడు మూర్ఛ తో కిందపడి మృతి చెందాడని సుబ్బయ్య సమాచారమిచ్చాడు.
దీంతో అక్కడికి వెళ్లేందుకు బయల్దేరుతుండగానే తానే మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తున్నానంటూ సుబ్బయ్య ఫోన్లో చెప్పి తీసు కొచ్చాడు. మరుసటి రోజు వెంకటేష్నాయుడు మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్న తన భర్త ఎలా మృతిచెందాడని బాధితురాలు సుబ్బయ్యను ప్రశ్నించింది. దీంతో నీళ్లు నమిలిన సుబ్బయ్య రూ.3లక్షలు ఇస్తానని గ్రామస్తుల సమక్షంలో ఒప్పుకున్నాడు. అతని మృతికి అనారోగ్యం కారణం కాదని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారణలో ఉంది