ఎంబీబీఎస్ ప్రవేశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల తీరు వల్ల తమకు ప్రవేశం దొరకలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన పలువురు విద్యార్థులకు 2014-15 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎం.సునీల్‌కుమార్ జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ యాజమాన్యపు కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం ఏవైనా నిబంధనలు రూపొందించదలచుకుంటే, ఆ పని చేయవచ్చునని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులు ఇవ్వలేదని, వాటి తీరుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, అందువల్ల ప్రతిభ ఆధారంగా తమకు సీట్లు కేటాయించేలా కాలేజీలను ఆదేశించాలని కోరుతూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావు యాజమాన్యపు కోటా సీట్ల భర్తీ విషయంలో పలు మార్గదర్శకాలను రూపొందించి వాటి అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు 2014-15 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలను ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎంఎన్ఆర్, కామినేని, అపోలో తదితర మెడికల్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటి వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం విచారించింది. సింగిల్‌జడ్జి తీర్పు తమ హక్కులను హరించే విధంగా ఉందని ఆయా కాలేజీల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం... గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.